రేపే శ్రీ ఆలేటి ఎల్లమ్మ తల్లి జాతర..

రేపే శ్రీ ఆలేటి ఎల్లమ్మ తల్లి జాతర..జనగామ జిల్లా : శివసత్తుల కోలాహలం, డిళ్లేం…కళ్లేం చప్పుళ్లతో మహిళలు నెత్తిన బోనమెత్తుకొని తల్లి సన్నిధికి చేరుకోగ, పిల్లాపాపలను సల్లంగా చూసి, పాడి పంటలు సమృద్దిగా పండేలా దీవించు.. అంటూ ఆలేటి ఎల్లవ్వ శరణు..శరణు నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగనుంది. మకర సంక్రాంతి పర్వదినం తర్వాతి రోజున అంటే కనుమ రోజు ఆలేటి ఎల్లవ్వ తల్లి జాతర అత్యంత వైభోగంగా ప్రారంభంకానుంది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామశివారులో ఆలేటి ఎల్లమ్మ జాతర ప్రతీ యేటా కన్నులపండుగగా జరగడం ఆనవాయితీగా వస్తుంది.

అయితే ఆలేటి ఎల్లమ్మ తల్లి జాతరను మినీ మేడారంలా అధికారులు ముస్తాబు చేశారు. కొవిడ్ నిబంధనల మధ్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా పాలకుర్తి పోలీసులు ముందస్తు జాగ్రత్తగా మహిళా, పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా కొవిడ్, ఒమిక్రాన్, డెల్టా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో భక్తులకు పాలకుర్తి ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు, సిబ్బంది మాస్కులను, సానిటైజర్ లను ఏర్పాటు చేసి జాతర ప్రాంగణంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్తా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని ఆలయ కమిటీ తెలిపారు.

జాతరకు ముందు రోజే ఎడ్ల బండ్లకు ప్రభలు కట్టి రైతులు బయల్దేరుతారు. జాతర ప్రారంభమయ్యే రోజు వేకువజామునే బోనాలతో వివిధ గ్రామాల మహిళలు ఆలేటి ఎల్లమ్మ సన్నిధికి చేరుకుంటారు. డిళ్లం..కళ్లెం.. చప్పుళ్లతో , శివసత్తుల పూనకాలతో, నెత్తిన బోనాలతో మహిళలు ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. పాలకుర్తి నియోజకవర్గం చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి , ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా గుజరాత్, మహారాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిమందిగా తరలివచ్చి ఎల్లమ్మ తల్లిని దర్శించుకోనున్నారు.

జాతర విశిష్టత..
ఆలేటి ఎల్లమ్మ తల్లి జాతర ప్రారంభానికి ముందే అత్తవారింటికి వచ్చిన కొత్త అల్లుళ్ళు, కూతుర్లు, కోడళ్లు పిల్లా పాపలతో పాలకుర్తి నియోజకవర్గం కళకళలాడుతుంది. ఇక జాతర ప్రారంభమయ్యే రోజు తెల్లవారుజాము నుండే భక్తులు అమ్మవారికి కోడి, మేక పిల్లలు బలి ఇచ్చి తర్వాత బోనాలతో కుటుంబ సమేతంగా శివ సత్తుల పునకాలు, కళాకారుల నృత్యాల మధ్య అమ్మవారి సన్నిధికి చేరుకుని బోనం కుండలో ఉన్న నైవేద్యన్ని సమర్పిస్తారు. గర్భ గుడి ముందు తీరొక్క రంగులతో పట్నాలను వేసి అనంతరం తాటిచెట్టు పై నుండి భక్తుల నమ్మకం ప్రకారం అమ్మవారి పసుపు ముద్దలు, గవ్వలు కింద పడతాయని ఆ మహిమ కలిగిన పసుపును భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో తమ తమ ఇంటికి తీసుకెళ్తారు. అలాగే పిల్లలు లేని వారు తాటిచెట్టు వద్ద భక్తితో కొలిచి వరం పడితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. చివరి ఘట్టంగా అమ్మవారు నాగుపాము రూపంలో తాటిచెట్టు పై నుండి పట్నాల, బోనం కుండల మీదుగా ఆలయం చుట్టూ తిరిగి మాయం అవుతుందని పెద్దలు చెపుతున్న పురాణం.