జనవరి 23 నుంచే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..

జనవరి 23 నుంచే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..న్యూఢిల్లీ : ఈ యేడాది నుంచి జనవరి 23 నుంచే రిపబ్లిక్ డే వేడుకలు ప్రారంభంకానున్నాయి. జనవరి 24న సుభాష్ చంద్రబోస్ జయంతి పురస్కరించుకుని ముందుగానే గణతంత్ర వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇక నుంచి ప్రతీ సంవత్సరం ఇలానే గణతంత్ర వేడుకలను నిర్వహించనున్నారు. భారత చరిత్ర, సంస్కృతికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను స్మరించుకోవడంపై ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఇందులో భాగంగా సుభాష్ చంద్రబోస్ జయంతిని పరాక్రమ్ దివాస్ గా జరుపుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆగస్టు 14న దేశ విభజన సంస్మరణ దినోత్సవంగాను, అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యత దివాస్ గా ప్రభుత్వం నిర్వహిస్తోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీలో జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు కేవలం 24 వేల మందికి అనుమతి ఇవ్వనున్నట్లు కేంద్రం వెల్లడించింది. కరోనాకు ముందు 2020లో రిపబ్లిక్ వేడుకల్లో దాదాపు 1 లక్షల 25వేల మంది పాల్గొన్నారు. గత యేడాది కరోనా నిబంధనల మధ్య 25 వేల మందిని అనుమతించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.