మెల్బోర్న్ : ఆతిథ్య ఆసీస్‌తో బాక్సింగ్ డే జట్టుకు భారత్ తుది జట్టులో నాలుగు మార్పులు చేయనుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ మిగిలిన టెస్టులకు అందుబాటులో ఉండకపోవడంతో అజింక్య రహానె జట్టుకు నాయకత్వం వహిస్తాడు. వెటరన్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహా, యంగ్ ఓపెనర్ పృథ్వీషాలను జట్టు నుంచి తప్పించనున్నారు. ఆడిలైడ్ టెస్టులో బ్యాటింగ్ లైనప్ కుప్పకూలడంతో బ్యాటింగ్‌లో మార్పులు చేస్తున్నారు. రెండో టెస్టు డిసెంబర్ 26న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ప్రారంభంకానుంది. కాగా నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0తో ఆధిక్యంలో ఉంది. సాహా బ్యాటింగ్ ఎలాంటి నమ్మకాన్ని కలిగించకపోవడంతో టీమ్ మేనేజ్మెంట్ యువ క్రికెటర్ రిషబ్ పంత్‌పై చూస్తోంది. వార్మప్ మ్యాచ్‌లో పంత్ శతకంతో చెలరేగడం, ఆస్ట్రేలియా పిచ్‌లపై కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించడం పెద్ద సమస్యకాదని మేనేజ్మెంట్ భావిస్తోంది. తర్వాతి మూడు టెస్టుల్లో పంత్ మంచి ప్రదర్శన చేస్తే ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు అతడు ఎంపికయ్యే అవకాశాలు ఉండనున్నాయి. అలాగే ఘోరమైన వైఫల్యంతో విమర్శలు ఎదుర్కొన్న పృథ్వీషా స్థానంలో ఫామ్‌లో ఉన్న శుభ్మన్గిల్కు చోటు దక్కనుంది. కోహ్లీ స్థానాన్ని కేఎల్ రాహుల్ భర్తీ చేయనున్నాడు. గాయంతో సిరీస్ నుంచి తప్పుకున్న సీనియర్ పేసర్ మహ్మద్ షమీ స్థానలో చోటు చోసం మహ్మద్ సిరాజ్ ఆసక్తిగా చూస్తున్నాడు. హనుమ విహారిని బ్యాటింగ్‌లో ముందుగా పంపాలని కూడా ఆలోచనలు చేస్తున్నారు. కాగా మూడో టెస్టులో రోహిత్ శర్మ అందుబాటులోకి వస్తే బ్యాటింగ్ లైనప్‌లో మళ్లీ మార్పులు చోటుచేసుకోవచ్చు.
రెండో టెస్టుకు టీమీండియా అంచనా
మయాంక్ అగర్వాల్, శుభమన్‌గిల్, పుజారా, కేఎల్‌రాహుల్, రహానె హనుమవిహారి,పంత్, అశ్విన్, మహ్మద్‌సిరాజ్, బుమ్రా, ఉమేశ్‌యాదవ్