ఇంజినీరింగ్‌ విద్యలో మార్పులకు ఏఐసీటీఈ శ్రీకారం

 

ఇంజినీరింగ్‌ విద్యలో మార్పులకు ఏఐసీటీఈ శ్రీకారం
హైదరాబాద్‌ : ఇంజినీరింగ్‌ విద్యావిధానంలో సమూల మార్పులకు జాతీయ సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న సెమిస్టర్‌ విధానం స్థానంలో నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని (సీసీఈ) ప్రవేశపెట్టాలని భావిస్తున్నది. ఈ విధానంలో సీసీఈకి ఏకంగా 70 శాతం వెయిటేజీ ఇచ్చి, సంవత్సరాంత పరీక్షను కేవలం 30 శాతం మార్కులకే నిర్వహించే అంశంపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. సీసీఈ విధానంలో విద్యార్థికి కాలేజీలో నెలవారీ పరీక్షలు, స్లిప్‌టెస్టులు, అసైన్‌మెంట్లు నిర్వహించి ప్రతిభను పరీక్షిస్తారు. దీనివల్ల విద్యార్థిలో సబ్జెక్టుపై ఆసక్తి, పట్టు పెరుగుతుందని ఏఐసీటీఈ భావిస్తున్నది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైనా నిర్దేశించిన సమయానికే సిలబస్‌ పూర్తిచేయటానికి కూడా ఈ విధానం తోడ్పడుతుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, జేఎన్టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించాలంటే భౌతికదూరం తప్పనిసరి అయిన పరిస్థితుల్లో విద్యార్థులకు రోజు విడిచి రోజు క్లాసులు నిర్వహించే అంశంపై కూడా ఏఐసీటీఈ కసరత్తు చేస్తున్నది.