టీమిండియాపై సౌతాఫ్రికా ఘన విజయం

టీమిండియాపై సౌతాఫ్రికా ఘన విజయంస్పోర్ట్స్ డెస్క్ : అత్యుత్తమ టెస్టు జట్టుగా పరిగణించే టీమిండియా, కనీసం పోరాటం కూడా లేకుండా సఫారీలపై మూడో టెస్టులో చిత్తయింది. మూడో ఇన్నింగ్స్ లో రిషభ్ పంత్ ( 100 నాటౌట్ ), విరాట్ కోహ్లీ (29) తప్ప మిగతా బ్యాటర్లెవరూ రాణించలేదు. దీంతో టీమిండియా జట్టు 198 పరుగులకే ఆలౌట్ అయింది. సఫారీల ముందు 213 పరుగుల టార్గెట్ మిగిలింది. ఆచితూచి ఆడిన సఫారీ బ్యాటర్లు ఎయిడెన్ మార్క్రమ్ ( 16), డీన్ ఎల్గార్ (30), కీగన్ పీటర్సన్ (82), రాసీ వాన్ డర్ డస్సెన్ (41 నాటౌట్ ), టెంబా బవుమా 9 32 నాటౌట్ ) రాణించడంతో ప్రొటీస్ జట్టు సులభంగా విజయం సాధించింది.

భారత మిడిలార్డర్ అత్యంత దారుణంగా విఫలం కావడంతో దక్షిణాఫ్రికా మిడిలార్డర్ మొక్కవోని దీక్షతో విజయానికి బాటలు వేసింది. అదే సమయంలో సఫారీ పేసర్లు నిప్పులు చెరిగిన పిచ్ పై భారత బౌలింగ్ దళం వెలవెలబోయింది. దీంతో ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు 7 వికెట్ల తేడాతో గెలుపు రుచి చూశఆరు. ఫీల్డింగ్ లోపాలు కూడా భారత్ కొంప ముంచాయి. కీగన్ పీటర్సన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే క్యాచ్ అవ్వగా, పుజారా దాన్ని జారవిడిచారు. చాలా సులభమైన ఆ క్యాచ్ ఒక విధంగా మ్యాచ్ గతినే మార్చేసిందని చెప్పొచ్చు.

ఆ తర్వాత 64వ ఓవర్లో 8 పరుగులు కావాల్సిన సమయంలో భారత ఫీల్టర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓవర్ త్రో కారణంగా సఫారీలకు మరో 5 పరుగులు వచ్చాయి. ఆ తర్వాతి బంతిని బౌండరీ బాదిన బవుమా, సఫారీలకు చరిత్రాత్మక విజయం అందించాడు. సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవాలన్న భారత ఆశలు ఆవిరి చేశాడు.