వరంగల్ వరదబాధితులను ఆదుకోండి

వరంగల్ వరదబాధితులను ఆదుకోండివరంగల్ అర్బన్ జిల్లా : వరంగల్ నగరంలో బీజేపీ నాయకులు నిరసనకు దిగారు. వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో ఎంజీఎం సర్కిల్ లో రాస్తారోకో నిర్వహించారు. హైదరాబాద్ వరద బాధితులకు ఆర్థిక సాయం చేసిన రాష్ట్ర ప్రభుత్వం , వరంగల్ వరదబాధితుల పట్ల వివక్షత చూపడాన్ని ఎండగడుతూ ఎంజీఎం చౌరస్తాలో రహదారి దిగ్భంధం చేసి ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వం గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి కోట్లాది రూపాయలు మంజూరు చేసినా, రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ అభివృద్ధిలో వివక్షత చూపిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో జిల్లాకో తీరు న్యాయం చేసే టీఆర్ఎస్ నేతలకు త్వరలోనే ప్రజలు బుద్ది చెప్తారని హెచ్చరించారు. ఇప్పటికే టీఆర్ఎస్ అవినీతి పాలనకు, నిర్లక్ష్య ధోరణికి అటు దుబ్బాక, ఇటు జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే చెంపపెట్టుగా నిలిచాయని, అదే తరహాలో రానున్న ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల్లోనూ ముందుకు వెళ్తామని రావు పద్మ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏంటో , కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏంటో ప్రజలు గమనిస్తూనే వున్నారని త్వరలోనే వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ద్వారా జిల్లా ప్రజలు చెంపపెట్టు పెడతారని ఆమె హెచ్చరించారు. వరంగల్ వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయకపోతే నిరసనలు కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో రావు పద్మతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు మార్తినేని ధర్మారావు, వన్నాల శ్రీరాములు, బీజేపీ జిల్లా యువ నాయకులు ఎనుగుల రాకేష్ రెడ్డి, వరంగల్ తూర్పు బీజేపీ నాయకులు కుసుమ సతీష్ , బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.