బీజేపికి షాక్ ఇచ్చిన తీన్మార్ మల్లన్న 

బీజేపికి షాక్ ఇచ్చిన తీన్మార్ మల్లన్న

త్వ‌ర‌లో కొత్త రాజ‌కీయ పార్టీ
సన్నాహాలు ముమ్మరం చేశామన్న చింతపండు నవీన్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : జర్నలిస్టు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న బీజేపీకి షాక్ ఇచ్చారు. గత డిసెంబర్ లో కాషాయ కండువా కప్పుకున్న ఆయ‌న 6 నెలలు తిరక్కముందే కమలం శిబిరం నుంచి బయటికొచ్చేశారు. ఆదివారం తన అనుచరులతో నిర్వహించిన కీలక సమావేశంలో మల్లన్న స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని పెడతానని ఆయన ప్రకటించారు. ఆదివారం మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం కొర్రెములలో తీన్మార్‌ మల్లన్న టీం-7200 ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉచిత విద్య, వైద్యం, ప్రజలకు సత్వర న్యాయంపై తీర్మానాలు చేశారు.బీజేపికి షాక్ ఇచ్చిన తీన్మార్ మల్లన్న అనంతరం చింతపండు నవీన్ మాట్లాడారు. “రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న దొంగల ముఠా సభ్యుల సంఖ్య 7200. తెలంగాణ ఆస్తులను కొల్లగొడుతున్న వారి సంఖ్య 7200. రాష్ట్ర ప్రజల రక్తం తాగుతున్న వారి సంఖ్య 7200. అందుకే మల్లన్న టీం-7200 పేరుతో నేను ఉద్యమం చేస్తున్నా. నేను ఏర్పాటు చేసిన ఈ టీం బీజేపీ కన్నా లక్ష రెట్లు నయం. ఇక బీజేపీ కార్యాలయంలో నేను ఎప్పటికీ అడుగుపెట్టను. నేను బీజేపీలో చేరడం అనేది ఇక ముగిసిన చరిత్ర” అని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు.

కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేశామని అన్నారు. మరో పది రోజుల్లో ప్రజల్లోకి వెళ్తామని ప్రకటించారు. తనపై తన కుటుంబ సభ్యులపై ఉన్న ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికి రాసిచ్చి రాజకీయాల్లోకి వస్తానని తీన్మార్ మల్లన్న తెలిపారు. 176 మంది చిన్నారులకు తమ టీం గుండె చికిత్స చేయించిందని తెలిపారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, న్యాయం అందని ప్రజల మద్దతును కూడగట్టుకుంటామని అన్నారు. ఏడాదిన్నర తరువాత హైదరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో పది లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని నవీన్ ధీమా వ్యక్తం చేశారు.