తెలుగు సినీకళామతల్లి ముద్దుబిడ్డలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)

తెలుగు సినీ రంగంలో నటీనటుల సంఘానిది 26 ఏళ్ల చరిత్ర. నటీనటులకు సంబంధించిన సమస్యలు, వివాదాల పరిష్కారలు, సభ్యుల సంక్షేమం కొసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 1994లో ఏర్పాటయింది. అప్పుడు వంద మంది సభ్యులు మాత్రమే ఉండేవారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా చిరంజీవి వ్యవహరించారు.

వాస్తవానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఆకాశంలో అంకురించింది. పోలీసుశాఖ సహాయార్థం తెలుగు నటీనటులు విశాఖపట్నంలో క్రికెట్ మ్యాచ్ ఆడి నిధులు సమీకరించారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ వస్తున్న క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, మురళీమోహన్.. నటీనటుల సంఘంపై ఆలోచన చేశారు. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు లాంటి పెద్దల సమక్షంలో కళాకారులకు అమ్మలాంటి MAA సంస్థను ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు. అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకోవడంతో మెగాస్టార్ చిరంజీవిని వ్యవస్థాపక అధ్యక్షుడిగా ‘మా’ పుట్టింది. అక్కినేని నాగేశ్వర్ రావు, కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్ తదితర సీనియర్లు ముఖ్య సలహాదారులుగా వ్యవహరించారు. రెండేళ్లు మురళీమోహన్ నివాసంలోనే ‘మా’ కార్యకలాపాలు కొనసాగించారు. ఆ తర్వాత ఫిల్మ్ నగర్లోని రామానాయుడు నిర్మించిన సొసైటీ భవనంలోని ఓ గదిలో 1993 అక్టోబర్ 4న అసోసియేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

నటీనటులకు సంబంధించిన పారితోషికాలు, దర్శక నిర్మాతలతో వివాదాలు, సభ్యుల సంక్షేమాన్ని చూసుకోవడం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన ఉద్దేశం. నిర్మాతలెవరైనా నటీనటులకు పారితోషకం ఇవ్వకపోయినా, దర్శక నిర్మాతలకు నటీనటులకు గొడవలు జరిగినా ‘మా’ జోక్యం చేసుకుని వాటిని పరిష్కరిస్తుంది. అలాగే నిరుపేద కళాకారులు, వృద్ధ కళాకారుల ఆరోగ్యం కోసం సహాయం చేయడం, అవకాశాలు లేని వారికి సినిమా అవకాశాలు ఇప్పించడం అసోసియేషన్ బాధ్యత. ఈ బాధ్యతలను అసోసియేషన్లోని కార్యవర్గ సభ్యులు చిన్న చిన్న కమిటీలుగా ఏర్పడి సభ్యుల సంక్షేమాన్ని చూసుకునేవారు.

మా అసోసియేషన్కు మొదట వ్యవస్థాపక అధ్యక్షుడిగా చిరంజీవి కొనసాగగా ఆ తర్వాత బాధ్యతలను మురళీమోహన్ స్వీకరించారు. ప్రతి రెండేళ్లకోసారి అసోసియేషన్ అధ్యక్షుడ్ని ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో మోహన్బాబు, నాగార్జున, నాగబాబు.. ‘మా’ అసోసియేషన్కు సేవలందించగా ఆరు సార్లు మురళీమోహన్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2021 అక్టొబర్లో జరిగిన “మా” కార్యవర్గ ఎన్నికలలో గెలుపొందిన మంచు విష్ణు గారు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నరు. ప్రస్తుతం ‘మా’లో 914 మంది శాశ్వత సభ్యులుండగా.. 29 మంది అసోసియేట్ సభ్యులు, 18 మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వారిలో చనిపోయిన వారి సంఖ్య తీసివేస్తే 850 మంది మాత్రమే అసోసియేషన్‌లో యాక్టివ్ మెంబర్లుగా ఉన్నారు.