టిడ్కో ఇళ్లను పంపిణీ చేస్తాం

గుడివాడలో 7,656 టిడ్కో ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

టిడ్కో ఇళ్లను పంపిణీ చేస్తాంగుడివాడ : రాష్ట్రంలో 2. 62 లక్షల టిడ్కో గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) చెప్పారు. శనివారం స్థానిక రాజేంద్రనగర్​లోని నివాసంలో టిడ్కోగృహాలు , ఇళ్లపట్టాల పంపిణీకి సంబంధించి మున్సిపల్ కమిషనర్ పీజే సంపత్ కుమార్​తో సమీక్షించారు .టిడ్కోగృహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.‘ఈ నెల 25 వ తేదీన 30. 75 లక్షల ఇళ్లపట్టాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోందన్నారు . ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్మోహనరెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు . రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల 65 వేల 987 ఇళ్లస్థలాలపై కోర్టు కేసులు ఉన్నాయన్నారు. ఇళ్లస్థలాల కోసం 68 వేల 361 ఎకరాలను సేకరించినట్లు పేర్కొన్నారు. ఈ భూముల విలువ రూ . 23 వేల 535 కోట్లు ఉంటుందన్నారు . కోర్టు కేసుల కారణంగా ఇళ్లస్థలాలు ఇవ్వలేకపోతున్న ప్రాంతాల్లో ఎంపికైన లబ్ధిదారులకు కేసులు పరిష్కారమైన వెంటనే పట్టా ఇస్తామన్నారు . 25 వ తేదీన ఇళ్లపట్టాల పంపిణీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 15. 6 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామన్నారు . రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 8,914 ఇళ్ల చొప్పున నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు . రెండవ దశలో 12.7 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించి వచ్చే మూడేళ్ళలో 28. 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసిందన్నారు . ప్రభుత్వం ఇచ్చే 300 చదరపు అడుగుల టిడ్కో గృహాలను రూ .1 కే అందజేయడం జరుగుతుందన్నారు . 365 , 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే టిడ్కో ఇళ్ళకు సీఎం జగన్మోహనరెడ్డి రాయితీలను ప్రకటించారన్నారు . దీనివల్ల రూ . 482 కోట్ల ఖర్చును ప్రభుత్వం భరించనుందని తెలిపారు . ఇదిలా ఉండగా గుడివాడ నియోజకవర్గంలో 10 వేల మంది పేదలకు ఇళ్లస్థలాలివ్వాలని 2007 వ సంవత్సరంలో గుడివాడ పట్టణం నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేశానన్నారు . వినతి పత్రం స్వీకరించిన అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2008 లో గుడివాడ రూరల్ మండలం మల్లాయిపాలెం పరిధిలో 77 ఎకరాల భూములను కొనుగోలు చేసి ఇచ్చారన్నారు . ఈ భూముల్లో 8,912 టిడ్కో ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు . ఈ నెల 25 న జరిగే పంపిణీలో 7,656 మంది . లబ్ధిదారులకు టిడ్కో గృహాలను అందజేస్తున్నామన్నారు . వీటితో పాటు అదే ప్రాంతంలో సేకరించిన 181 ఎకరాల భూముల్లో ఇళ్లస్థలాలను పేదలకు కేటాయిస్తున్నామన్నారు . దీనిలో భాగంగా 5,300 మంది లబ్ధిదారులకు ఇళ్లస్థలాలు అందనున్నాయని తెలిపారు . ఇళ్లస్థలాల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని , కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా అర్హత ఉంటే 90 రోజుల్లో మంజూరు చేస్తామని మంత్రి కొడాలి చెప్పారు . అర్హత ఉండి లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని వారు ఆందోళన చెందవద్దని , ఎందరు అర్హులున్నా వారందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలని సీఎం జగన్మోహనరెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని మంత్రి కొడాలి నాని చెప్పారు .