నిషేధిత భూ సమస్యలపై దరఖాస్తు చేసుకోవాలి

నిషేధిత భూ సమస్యలపై దరఖాస్తు చేసుకోవాలిగుడివాడ : 22ఎ నిషేధిత భూముల జాబితా నుంచి రిజిస్ట్రేషన్ , పట్టా భూములను తొలగించేందుకు ఆయా భూముల యజమానులు జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) సూచించారు. శనివారం స్థానిక రాజేంద్రనగర్​లోని నివాసంలో మంత్రిని చల్లపల్లి మండలం మంగళాపురానికి చెందిన అరుణ కలిశారు .‘తనకు చెందిన వ్యవసాయ భూమికి డాక్యుమెంట్స్ సక్రమంగానే ఉన్నాయని అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగడం లేదని తనకు న్యాయం చేయాలని’ఆమె మంత్రిని కోరారు .
దీంతో స్పందించిన మంత్రి ఉమ్మడి రాష్ట్రంలో 2007 వ సంవత్సరంలో సవరణ ద్వారా నిషేధిత భూముల జాబితా 22 ఎను ప్రభుత్వం రూపొందించిందన్నారు . దీని ప్రకారం ప్రభుత్వ భూములు , అసైన్డ్ భూములు , షెడ్యూల్డ్ , గిరిజన భూములను గిరిజనేతులు కొనడానికి వీలుండదన్నారు . ఆయా భూముల రిజిస్ట్రేషన్లు కూడా జరగవన్నారు . జిల్లా కలెక్టర్ లేదా ఆథరైజ్డ్ అధికారి పంపిన 22 ఎ జాబితాలోని భూములకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేయడం కుదరదన్నారు . కొన్నిచోట్ల పట్టా భూములు , వ్యవసాయ భూములు కూడా నిషేధిత భూముల జాబితాలో చేరాయన్నారు . అయితే 1917 లో జరిగిన సర్వే సెటిల్మెంట్ ప్రకారం అప్పటి రికార్డులే రెవెన్యూశాఖకు ప్రామాణికమన్నారు . అయితే కాలానుగుణంగా భూమి స్వభావం మారుతూ వచ్చిందన్నారు . 22 ఎ జాబితాలో భూములకు , అడంగళ్ కు పొంతన లేకుండా పోయిందన్నారు . దీనివల్ల భూములను అమ్ముకునే వారు రిజిస్ట్రేషన్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు . 22ఎ నిషేధిత భూముల జాబితా నుంచి పట్టా భూములను తొలగించడానికి సంబంధించి హైకోర్టు తీర్పుతో పాటు ప్రభుత్వం జారీ చేసిన స్పష్టమైన జీవో కూడా ఉన్నాయన్నారు. నిషేధిత భూములు కాని పట్టా భూములను 22 ఎలో చేర్చివుంటే సంబంధిత భూ యజమానులు జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాలన్నారు . వెంటనే ఆయా దరఖాస్తులను పరిశీలించి తగు ఉత్తర్వులను జారీ చేస్తారన్నారు . ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో భూ పరిపాలనా ప్రధాన అధికారి , సర్వే సెటిల్మెంట్ అధికారి , రిటైర్డ్ జిల్లా జడ్జి స్థాయి అధికారితో ఏర్పాటైన కమిటీకి కూడా దరఖాస్తు చేసుకుంటే ఆయా వివరాలను పరిశీలించి పట్టా భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తారన్నారు . అలాగే సివిల్ కోర్టులో టైటిల్ డిక్లరేషన్ సూట్ వేసి 22 నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేలా ఉత్తర్వులను పొందచవ్చని మంత్రి కొడాలి నాని తెలిపారు . ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మల్లిపూడి శ్రీనివాస చక్రవర్తి పాల్గొన్నారు.