హాస్య నటుడు పృథ్వీరాజ్‌కి కరోనా

హాస్య నటుడు పృథ్వీరాజ్‌కి కరోనాహైదరాబాద్‌: కరోనా వైరస్‌ విజృంభణతో సినీ రంగం వణుకుతోంది. దేశంలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కొవిడ్‌ బారినపడ్డారు. కొందరు కోలుకొని డిశ్చార్జి కాగా.. మరికొందరు ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నారు. తాజాగా ప్రముఖ హాస్య నటుడు పృథ్వీరాజ్‌ కరోనా బారినపడ్డారు. 10 రోజుల నుంచి తీవ్ర జ్వరం, జలుబుతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా వైరస్‌ సోకినట్టు నిర్థారించారు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నానని పేర్కొంటూ ఆయన ప్రత్యేక వీడియో విడుదల చేశారు.‘‘10 రోజుల నుంచి తీవ్రమైన అనారోగ్యంతో, జ్వరంతో బాధపడుతున్నా. అన్ని టెస్ట్‌లూ చేయించాను. కొంతమంది కొన్నిచోట్ల కొవిడ్‌ నెగెటివ్‌ అన్నారు. మళ్లీ సి.టి. స్కాన్‌ చేయించాం. కొన్ని కేసుల్లో నెగెటివ్‌ వస్తుందని పేర్కొంటూ 15 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సలహా ఇచ్చారు. నిన్న అర్ధరాత్రి క్వారంటైన్‌లో జాయిన్‌ అయ్యాను. నాకు మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నా..’’ అన్నారు.