భాగ్యనగరానికి ఇది సిగ్గుచేటు!

400 ఏళ్ల చరిత్రగల భాగ్యనగరానికి ఇది సిగ్గుచేటు! అతితక్కువ పోలింగ్ శాతం

భాగ్యనగరానికి ఇది సిగ్గుచేటు!

భాగ్యనగరానికి ఇది సిగ్గుచేటు!హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల పోలింగ్ శాతం ఘోరంగా ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అతితక్కువ పోలింగ్ శాతం నమోదయ్యింది. గ్రేటర్ పోలింగ్ చాలా బద్దకంగా సాగుతున్నది. ఎన్నికల ప్రచారంలో ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప పార్టీలు ఓటర్లను కదలించలేకపోయాయి. మధ్యాహ్నం ఒంటిగంటకి 20 శాతం కూడా నమోదు కాకపోవడం గమనార్హం. పోలింగ్ శాతం ఇంత తక్కువగా ఉండటంతో అన్ని పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. పోలింగ్ కేంద్రాల వైపు విద్యాధికులు కన్నెత్తి కూడా చూడలేదు. మరోవైపు.. పోలింగ్ డేని హాలిడేగా కార్పొరెట్ ఉద్యోగులు ఎంజాయ్ చేస్తున్నారు. ఓటు వేయకపోవడం బాధ్యతారాహిత్యమే అని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిజంగా ఇది సిగ్గుచేటే!

కాగా.. జమ్మూకశ్మీర్‌ స్థానిక ఎన్నికల్లో 52శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది. అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మాత్రం ఇప్పటి వరకూ 18.02శాతం కూడా పోలింగ్‌ దాటలేదు. నిజంగా.. ఇది 400 ఏళ్ల చరిత్రగల భాగ్య నగరానికి సిగ్గుచేటు అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని పోలింగ్ బూతుల్లో ఇప్పటి వరకూ ఓటర్లే రాలేదు. దీంతో చేసేదేమీ లేక పోలింగ్ సిబ్బంది ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. సిటీలో మధ్యాహ్నం దాటినప్పటికీ ఓటేయడానికి జనాలు ఇళ్ల నుంచి బయటి రావట్లేదు కానీ.. నగరు శివారులో మాత్రం ఓటేసేందుకు జనాలు క్యూ కడుతున్నారు. పోలింగ్ ఇలానే జరిగితే మొత్తమ్మీద 50 శాతం కూడా ఓటింగ్ దాటడం కూడా అనుమానమే.!.

ఓటేయరు కానీ ప్రశ్నించడమా..!?

మరీ ముఖ్యంగా ఓటు వేయడానికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు బద్దకిస్తున్నారు. పోలింగ్ సందర్భంగా హాలిడే ఇచ్చినప్పటికీ ఓటు వేయడానికి ఇళ్లలో నుంచి బయటికిరావట్లేదు. పోలింగ్ డేని హాలిడేగా టెకీలు ఎంజాయ్ చేస్తున్నారు.!. సోషల్ మీడియాలో అందరూ ప్రశ్నిస్తారు కానీ.. ఓటేసేందుకు మాత్రం ముందుకు రారా..? అంటూ హైదరాబాద్ యువతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఓటు విషయంలో వికలాంగులు, వయోవృద్ధులు మాత్రం ఆదర్శంగా నిలుస్తున్నారు. క్యూ ఉన్నప్పటికీ ఎంతో ఓపికతో నిలబడి మరీ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

సామాన్యుడి కన్నెర్ర..

ఓటేయని వాళ్లపై ఓటేసిన సామాన్యుడు కన్నెర్రజేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల దగ్గర ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో తమ అభిప్రాయాల్ని పలువురు ఓటర్లు షేర్ చేసుకున్నారు. పోలింగ్‌ కేంద్రం వైపు కన్నెత్తి చూడని వారికి ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ఫలాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరైతే ఓటు వినియోగించుకోని వారికి ఓటు హక్కు అవసరమా..? వెంటనే వారికున్న ఆ హక్కును తీసేయండి అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

కోవిడ్ వల్లే తగ్గింది..!?

ఈ పోలింగ్ ప్రక్రియపై ఎన్నికల కమిషనర్‌ పార్ధసారథి మీడియాతో మాట్లాడారు. పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోందని.. ఓల్డ్‌ మలక్‌పేట్‌ ఘటనలో ప్రింటింగ్ ప్రెస్‌లో సింబల్ తప్పుగా పడిందన్నారు. కోవిడ్ వల్ల కొంత ఓటింగ్ తగ్గిందన్నారు. గతంలో కోవిడ్ లేదు కాబట్టి మధ్యాహ్నం 12 లోపు ఓటు హక్కు వినియోగించుకొనే వాళ్లు అని పార్ధసారథి వెల్లడించారు. జియగూడాలో ఓట్లు గల్లంతు అనేది వాస్తవం కాదని.. వారి ఓట్లు పక్కన ఉన్న భవనంలో ని పోలింగ్ కేంద్రానికి వెళ్ళాలని ఈసీ స్పష్టం చేసింది. అన్ని ప్రాంతాల్లో సజావుగా ఎన్నికలు కొనసాగుతున్నాయని ఈసీ ఓ ప్రకటనలో పేర్కొంది.