ఎన్నికల ఖర్చు పరిమితి ఎంత వుండాలి?

ఎన్నికల ఖర్చు పరిమితి ఎంత వుండాలి?హైదరాబాద్: లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల గరిష్ఠ వ్యయ పరిమితి ఎంత ఉండాలని అభిప్రాయం కోరుతూ నమోదిత జాతీయ, ప్రాంతీయ పార్టీలకు ఎన్నికల సంఘం ఈనెల 7న లేఖలు రాసింది. దీనిపై సలహాలు, సూచనలు కోరింది. అభ్యర్థుల వ్యయ పరిమితిపై గత అక్టోబరులో ఏర్పాటైన సమీక్ష సంఘం నోడల్‌ అధికారికి వాటిని పంపాలని సూచించింది. జాతీయ స్థాయిలో చివరిసారిగా 2014లో అభ్యర్థుల వ్యయ పరిమితిని నిర్ణయించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు దాన్ని 10% పెంచారు. అయితే, రాష్ట్రాల పరిమాణాన్ని బట్టి ఈ వ్యయంలో హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, బిహార్, హరియాణా తదితర రాష్ట్రాల్లో లోక్‌సభకు పోటీచేసే అభ్యర్థి ప్రస్తుతం గరిష్ఠంగా రూ.77 లక్షలు ఖర్చు చేయవచ్చు. అంతకుముందు ఇది రూ.70 లక్షలుగా ఉండేది. ఈ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే వారి వ్యయ పరిమితిని రూ.28 లక్షల నుంచి రూ.30.8 లక్షలకు పెంచారు.