ఈస్ట్ లో సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా? 

ఈస్ట్ లో సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా?

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఈసారి కూడా పాత సెంటిమెంటు రిపీటవుతుందా? కొత్త నేత ఎమ్మెల్యే కావడం ఖాయమా? లేక నన్నపునేని నరేందర్ రెండోసారి జెండా ఎగరవేస్తారా? ఈస్ట్ లో ఏం జరగబోతోంది? ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.నియోజకవర్గంలో ఎవరిని కలిసినా ఇదే చర్చించుకుంటున్నారు.

ఈస్ట్ లో సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా? 

*ఈస్ట్ లో ప్రజా తీర్పును అంచనా వేయడం కష్టమే!
వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో గత మూడు ఎన్నికల ఫలితాలను చూస్తే ఓటర్లు విచిత్రమైన తీర్పును ఇచ్చారు. 2009లో ప్రస్తుత బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అప్పట్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ హవా ఉండడంతో అప్పుడే ఆయన ఈజీగా విక్టరీ కొట్టారు. 2014కు వచ్చేసరికి టీఆర్ఎస్ హవా వీచింది. గులాబీ అభ్యర్థిగా కొండా సురేఖ సడెన్ ఎంట్రీ ఇచ్చారు. బస్వరాజు సారయ్యపై కొండా సురేఖ విజయ ఢంకా మోగించారు. ఆ తర్వాత 2018కు వచ్చేసరికి పరిస్థితి మారింది. కొండా సురేఖకు గులాబీ టికెట్ దక్కలేదు. దీంతో ఆమె పార్టీ మారి పరకాల నుంచి పోటీ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్నపునేని నరేందర్ రంగంలోకి దిగారు. నరేందర్ నే విజయం వరించింది. సీఎం కేసీఆర్ బొమ్మతో ఆయన విజయానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం రాలేదు. కానీ ఈసారి మాత్రం పరిస్థితి అలా ఉండకపోవచ్చని తెలుస్తోంది.

* ఈస్ట్ లో రెండో సారి విక్టరీ కష్టమే!
వరంగల్ ఈస్ట్ లో ప్రస్తుత రాజకీయ వాతావరణం మరోలా ఉంది. నియోజకవర్గంలో గులాబీపార్టీ గతంలో ఉన్నంత బలంగా ఈసారి లేదన్న వాదన వినిపిస్తోంది. వరుసగా రెండుసార్లు అధికారంలో ఉండడంతో ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉందన్నది మాత్రం వాస్తవం. వరంగల్ వెస్ట్ తో పోల్చుకుంటే ఈస్ట్ లో అంతగా అభివృద్ధి జరగలేదన్న విమర్శలున్నాయి. వినయ్ భాస్కర్ లా నరేందర్ దూసుకుపోవడం లేదన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. వరంగల్ ఈస్ట్ లో గత మూడుసార్లు హిస్టరీని పరిశీలిస్తే ఏ ఎమ్మెల్యే కూడా రెండోసారి గెలవలేదు. దీంతో ఈసారి ఈస్ట్ లో పాత సెంటిమెంటు రిపీట్ అవుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

*ఈస్ట్ లో బీఆర్ఎస్ , బీజేపీ మధ్యే టఫ్ ఫైట్ ఖాయం
వరంగల్ ఈస్ట్ నుంచి నన్నపునేని నరేందర్ కు టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆయనకు టికెట్ దక్కడం ఖాయమేనంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. బీజేపీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ రావు పేరు బలంగా వినిపిస్తోంది. గతంలో ఆయన ఇక్కడ్నుంచి ప్రజారాజ్యం తరపున పోటీ చేసి గట్టిపోటీయే ఇచ్చారు. దీంతో ఈసారి ప్రదీప్ రావు ఇక్కడ్నుంచి పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. కమలం పార్టీ పెద్దలు కూడా ఆయనకు ఈస్ట్ టికెట్ ఇవ్వడానికి సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి అభ్యర్థి ఎవరో క్లారిటీ లేకపోయినా, పోటీ మాత్రం బీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉండేలా కనిపిస్తోంది.

ఈస్ట్ లో సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా? 

మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వరంగల్ ఈస్ట్ లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఖాయమనే వాదన వినిపిస్తోంది. బీఆర్ఎస్ కు బలమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ బీజేపీకి కూడా ఇక్కడ సానుకూల వాతారణం ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

*పాత సెంటిమెంటు బ్రేక్ అవుతుందా?
అందుకే ఈస్ట్ లో ఈసారి గతంలోలాగా ఏ పార్టీకి వన్ సైడ్ గెలుపు ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతోనే గట్టెక్కే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈ అంచనాలను పక్కనబెడితే, వరంగల్ ఈస్ట్ లో పాత సెంటిమెంటు బ్రేక్ అవుతుందా? లేదా? అన్నది చూడాలి.