రాష్ట్రంలో ముందస్తు ఉంటుందా..?

రాష్ట్రంలో ముందస్తు ఉంటుందా..?

రాష్ట్రంలో ముందస్తు ఉంటుందా..?

 

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరీ : రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికలు త్వరలోనే వస్తున్నాయా అన్న అనుమానాలు కలిగేలా అన్ని పార్టీల నేతల నుంచి హాట్ హాట్ డైలాగులు పేలుతున్నాయి. బీజేపీ అగ్రనేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వారేమో 6 నెలల్లోపు ఎన్నికలు వస్తాయని స్పష్టం చేస్తున్నారు.

అయితే అధికార పార్టీ నేతలు మాత్రం దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. రాష్ట్రంలో 2018 డిసెంబర్ లో ఎన్నికలు జరిగాయి. అంటే ఎన్నికలు 2023 డిసెంబర్ లో జరగాలి. కానీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వారు చెప్పే దాని ప్రకారం ఆరు నెలల్లోపు ఎన్నికలంటే జూన్ లోపే ఎన్నికలు జరగాలి. అంటే తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ముందస్తుకు వెళ్లాలి. కానీ ఆదిశగా బీఆర్ఎస్ వ్యవహారాలు లేవు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత లాంటి వారు యాక్టివ్ అయితే అయ్యారు. కానీ ఎన్నికలు వచ్చేస్తున్నాయని కానీ, ముందస్తుకు వెళ్తామని కానీ ఎక్కడా ప్రకటించలేదు. దీన్ని బట్టి చూస్తుంటే అంత తొందరగా ముందస్తుకు వెళ్తారా అంటే చెప్పడం కష్టమే.

నిజంగానే సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళ్లే ఆలోచనలో ఉంటే పరిస్థితి ఇలాగుండదు. అసలే ఆయన బీఆర్ఎస్ ను ప్రకటించారు. దేశమంతా పోటీ చేస్తానంటున్నారు. ఈ పరిస్థితిలో ముందస్తుకు వెళ్లాలంటే మరింత యాక్టివ్ గా ఉండాలి. కానీ కేసీఆర్ నుంచి ఆదిశగా వేగం పెంచే సూచనలు కనిపించడం లేదు. ముందస్తుకు వెళ్లే ఆలోచనే ఉంటే కేసీఆర్ ఎప్పుడే వేగం పెంచేవారు.

ఈపాటికే రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు జరిగేవి, కేటీఆర్ లాంటి వారు బహిరంగ సభలతో జనంలోకి వెళ్లే పరిస్థితి ఉండేది. కానీ బీఆర్ఎస్ అంత వేగంగా ముందుకెళ్లడం లేదు. కేసీఆర్, కేటీఆర్ అప్పుడప్పుడు తప్ప రెగ్యులర్ మీటింగులు చేయడం లేదు. ఇవన్నీ పరిణామాలను చూస్తుంటే ముందస్తుకు వెళ్లే పరిస్థితి లేకపోవచ్చన్నది విశ్లేషకుల మాట.

తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాలు, ఆలోచనలను ఎవరూ అంచనా వేయలేరు. ఎలాంటి సంకేతాలు ఇవ్వకుండా ముందస్తుకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీలకు తగిన సమయం ఇవ్వకూడదన్న ప్లానింగ్ కూడా ఉండొచ్చు. ఆ దిశగా కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కి తగిన సంకేతాలు అయితే ఉండొచ్చు. ఎందుకంటే కేసీఆర్ ఒకవేళ ముందస్తుకు వెళ్తే కేంద్రం నుంచి రాష్ట్ర బీజేపీకి సమాచారం అయితే పక్కా ఉంటుంది. కాబట్టి కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పేది కూడా అబద్ధం అని చెప్పలేం.

హైకమాండ్ నుంచి ఎంతో కొంత సమాచారం వారికి అంది ఉండొచ్చని విశ్లేషకుల అంచనా. లేకపోతే అంత ఈజీగా 6 నెలల్లోపు ఎన్నికలు వస్తాయని ఎలా ప్రకటిస్తారు? కాబట్టి ముందస్తు కోసం సీఎం కేసీఆర్ ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా అనుమానాలైతే కలుగుతున్నాయి. చూడాలి మరి నిజంగానే ముందస్తు ఎన్నికలు వస్తాయా లేక షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా అన్నది వెయిట్ అండ్ సీ!!