కేసీఆర్ బంపర్ ఆఫర్…!!

కేసీఆర్ బంపర్ ఆఫర్…!!

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరీ : తెలంగాణ ఉద్యమంతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుని, రాష్ట్రాన్ని ఏలుతున్న నాయకుడిగా పేరుతెచ్చుకున్న సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తన అదృష్ణాన్ని పరీక్షించుకునేందుకు బీఆర్ఎస్  పార్టీని స్థాపించి ప్రచారం ప్రారంభించారు. ముందుగా ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే పనిలో పడ్డారు. ఇటీవల ఏపీకి చెందిన కొందరు ప్రముఖులు బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. వారికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. కేసీఆర్ బంపర్ ఆఫర్...!!ఇంటి వద్ద నాయకులు, వారి అనుయాయులు బయలుదేరినప్పటినుంచి పార్టీలో చేరడం, తరవాత వారు విందులు ఆరగించడం, మరలా ఇంటికి చేరుకునే వరకు ఖర్చులన్నీ బీఆర్ఎస్ భరిస్తోంది. దీంతో నేతలు ఎగిరి గంతేస్తున్నారు. రాజకీయ నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ మాంచి ఆఫర్ ప్రకటించడంతో ఇక అటు ఇటు కాకుండా మిగిలిపోయిన నాయకులు బీఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేన సీనియర్ నాయకుడు తోట చంద్రశేఖర్, ఐఆర్ఎస్ మాజీ అధికారి పార్థసారధి, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వీరంతా హైదరాబాద్‌లో బీఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.

అయితే వీరి చేరికపై హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో 200 ప్రాంతాల్లో ఫ్లెక్సీలు కూడా వెలిసాయి. ఇవన్నీ కట్టాలంటే ఎంత లేదన్నా రూ.10 కోట్లు ఖర్చవుతుంది. హైదరాబాద్ నగరపాలక సంస్థ నుంచి అనుమతులు కూడా తీసుకోవాలి. ఇందుకు భారీ గానే చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఏపీ నేతలు చేశారా, వారి అభిమానులు చేశారా అంటే అదేమీ లేదు. మీకు ఒక్క రూపాయి ఖర్చు లేదు.

మీరు రెఢీగా ఉంటే చాలు, ఇంటికి కార్లు పంపిస్తాం. పార్టీ ఆఫీసు వద్ద బ్యాండు బాజాలు ఏర్పాటు చేసి స్వాగతం పలుకుతాం. టపాసులు పెద్ద ఎత్తున పేలతాయి. ఇక పార్టీలో చేరిన తర్వాత ఇంటికి వెళ్లేప్పుడు మీ ఇష్టం వచ్చిన రెస్టారెంట్లో ఆరగించవచ్చు. మందుబాబులకు మందు కూడా ఫ్రీ. ఇవన్నీ బీఆర్ఎస్ ఆఫర్లు. దీంతో రాజకీయ నిరుద్యోగులు ఎగిరి గంతేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరి కండువాలు కప్పుకుంటున్నారు.

సహజంగా ఏదైనా పార్టీలో చేరేవారు, వారి అనుచరగనాన్ని పోగు చేసుకుని, మందీమార్భలంతో కార్లు ఏర్పాటు చేసుకుని పార్టీ కండువా కప్పుకుంటూ ఉంటారు. బీఆర్ఎస్ కొత్త విధానాలకు నాంది పలికింది. పార్టీలో చేరాలనే ఉద్దేశం ఉంటే చెప్పండి మీకు రూపాయి ఖర్చు ఉండదు. అంతా పార్టీ చూసుకుంటుంది. అంతే కాదు. మీ ప్రాంతంలో పార్టీని విస్తరించేందుకు కార్యాలయాల ఏర్పాటు, నెల వారీ నిర్వహణ ఖర్చులు కూడా మేమే భరిస్తాం. ఇలాంటి బంపర్ ఆఫర్ ఎవరిస్తారు చెప్పండి. బీఆర్ఎస్ కార్పొరేట్ రాజకీయాలు, నిరుద్యోగులకు వరంగా మారాయి. ఏ పార్టీలో చెల్లని వారంతా బీఆర్ఎస్ కంపెనీలో చేరుతున్నారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.