మాస్టర్‌ మౌనికకు ‘మహిళా కమిషన్’ అభినందనలు

మాస్టర్‌ మౌనికకు 'మహిళా కమిషన్' అభినందనలువరంగల్ టైమ్స్,అమరావతి: ఇటీవల స్పెయిన్‌లో జరిగిన రొటేఖాస్‌ చెస్‌ ఫెస్టివల్‌లో 3వ విమ్‌ నార్మ్‌ సాధించడం ద్వారా ఉమెన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ సాధించిన గుంటూరుకు చెందిన బొమ్మిని మౌనిక అక్షయను ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అభినందించారు. సోమవారం మహిళా కమిషన్ కార్యాలయం లోని తన చాంబర్ లో ఆమె చేతులమీదుగా మౌనిక అక్షయను శాలువాతో సత్కరించారు. మౌనిక అక్షయ సాధించిన విజయం దేశ, రాష్ట్ర ప్రజలకు గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వాసిరెడ్డి పద్మ ఆకాంక్షించారు. అండర్‌–7 నుంచి అండర్‌–20 వరకు రాష్ట్ర స్థాయిలో అన్ని విభాగాల్లోనూ విజేతగా నిలిచి.. మూడుసార్లు సీనియర్‌ ఉమెన్స్‌లోనూ టైటిల్‌ దక్కించుకోవడం అరుదైన రికార్డుగా చెప్పారు.

2019లో ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్‌  ఓపెన్‌లో తొలి విమ్‌ నార్మ్, 2021 హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ ఓపెన్‌లో రెండో విమ్‌ నార్మ్, తాజాగా స్పెయిన్‌లో జరిగిన రొటేఖాస్‌ చెస్‌ ఫెస్టివల్‌లో 3వ విమ్‌ నార్మ్‌ సాధించడం ద్వారా ఉమెన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ గా నిలవడం గర్వకారణం అన్నారు. ఎన్నో సవాళ్లను అధిగమించి మౌనిక అక్షయను ప్రతిభావంతురాలిగా తీర్చిదిద్దిన ఆమె తండ్రి రామారావును వాసిరెడ్డి పద్మ మెచ్చుకున్నా రు. చదరంగంలో దేశం గర్వించే స్థాయిలో మరిన్ని పతకాలు సాధించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని ఆమె హామీనిచ్చారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ కార్యదర్శి శైలజ, డైరెక్టర్ ఆర్ సూయజ్ పాల్గొన్నారు.