కరోనా బారిన 1000 మంది పోలీసులు

కరోనా బారిన 1000 మంది పోలీసులున్యూఢిల్లీ : ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా విజృంభిస్తుంది. ఢిల్లీ అడిషనల్ కమిషనర్ ( క్రైం బ్రాంచ్) తో పాటు దాదాపు 1000 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. ఈమేరకు ఢిల్లీ పోలీసు వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. కరోనా బారిన పడిన పోలీసులందరూ క్వారంటైన్ లో ఉన్నారని పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత వీరంతా విధులకు హాజరవుతారని తెలిపారు. ఢిల్లీ పోలీస్ శాఖలో మొత్తం 80వేల మంది పని చేస్తున్నారు.

ఢిల్లీలో కరోనా వైరస్ నివారణకు నిర్విరామంగా పనిచేస్తున్న పోలీసులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని విధులు నిర్వర్తించినప్పటికీ కొవిడ్ బారిన పడటంతో మిగతా ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులందరూ ఫేస్ మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు కూడా వ్యాక్సిన్ తీసుకోని పోలీసులతో పాటు వారి కుటుంబాలు తక్షణమే టీకాను తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.