జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తిహైదరాబాద్: జీహెచ్ఎంసీ 150 డివిజన్లలో ఎన్నికలు జరుగగా, ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 30 ప్రాంతాల్లో అధికారులు కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. ప్రతీ సర్కిల్ పరిధిలో ఉన్న వార్డులను బట్టి 166 హాల్స్ ను ఏర్పాటు చేశారు. ఒక హాల్ కి 14 టేబుల్స్ ఏర్పాటు చేయగా, ప్రతీ టేబుల్ కి ఒక కౌంటింగ్ సూపర్వైజర్ , ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం కౌంటింగ్ సిబ్బంది 8వేల 152 మంది వుండగా, 31 మంది కౌంటింగ్ పరిశీలకులు వున్నారు. కౌంటింగ్ ప్రక్రియ రికార్డింగ్ కు సిసి టీవీల ఏర్పాటు చేశారు. ఉదయం 8గంటల కు ప్రారంభమయ్యే కౌంటింగ్ ప్రక్రియలో ప్రతీ రౌండ్ కి 14వేల ఓట్లు లెక్కింపు కు వున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతీ కౌంటింగ్ కు టేబుల్ దగ్గర శానిటైజర్ లు అందుబాటులో ఏర్పాటు చేసి, ప్రతీ అధికారి మాస్కులు ధరించి హాల్ లోకి రావాల్సి వుంటుంది. ప్రతీ టేబుల్ దగ్గర సిసి కెమెరాలతో కౌంటింగ్ ప్రక్రియ అంతా రికార్డ్ చేయనున్నారు. బ్యాలెట్ లెక్కించే కంటే ముందు పోస్టల్ బ్యాలెట్ లను కౌంట్ చేస్తారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 46.55శాతం పోలింగ్ నమోదు కాగా, 74 లక్షల 67వేల 256 ఓట్లు గ్రేటర్ పరిధిలో ఉండగా 34 లక్షల 50 వేల 331 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 18 లక్షల 60 వేల 40 మంది పురుషులు , 15 లక్షల తొంభై వేల 219 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, ఇతరులు 72 మంది జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియలో 1926 పోస్టల్ బ్యాలెట్ల ద్వారా పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక కౌంటింగ్ ప్రక్రియలో సెల్ ఫోన్లను అధికారులు నిషేదించారు.