అస్సాం మాజీ సీఎం తరుణ్‌ గొగొయ్‌ (84) కన్నుమూశారు

అస్సాం మాజీ సీఎం తరుణ్‌ గొగొయ్‌ (84) కన్నుమూశారు

గౌవహతి : అస్సాం మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు తరుణ్‌ గొగొయ్‌ (84) కన్నుమూశారు. ఆగష్టు 25న గొగొయ్‌ కరోనా బారినపడి కోలుకున్నారు. తిరిగి అనారోగ్యానికి గురికావడంతో ఈ నెల 2న గౌహాతి మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని శనివారం సాయంత్రమే ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా మారి అపస్మారక స్థితికి చేరడంతో ఆదివారం ఆరుగంటల పాటు డయాలసిన్‌ నిర్వహించినా పరిస్థితిలో మార్పు రాలేదని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. అస్సాంకు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన ఘనత తరుణ్‌ గొగొయ్‌దే. 2001లో మహా కూటమి విజయంతో ముఖ్యమంత్రిగా గొగొయ్‌ బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత వరుస ఎన్నికల్లో మూడు సార్లు కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చి ముఖ్యమంత్రిగా కొనసాగారు. గొగొయ్ మృతిపట్ల ప్రధాని మోదీ, ఆ రాష్ట్ర సీఎం సర్బానంద సోనావాల్‌తో సహా పలువురు ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు