శుభకార్యానికి వెళ్తూ మృత్యు ఒడిలోకి వెళ్లిన అన్నాచెల్లెళ్లు

శుభకార్యానికి వెళ్తూ మృత్యు ఒడిలోకి వెళ్లిన అన్నాచెల్లెళ్లువరంగల్ జిల్లా : మరికొన్ని రోజులైతే ఆ ఇద్దరూ అన్నా, చెల్లెళ్లకు పెళ్లి చేద్దామని నిర్ణయించారు కుటుంబసభ్యులు. అంతలోనే రోడ్డు ప్రమాదం ఆ అన్నాచెల్లెళ్లను బలితీసుకుంది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబ్బీర్ పేటకు చెందిన మొగుళ్ల రమేష్-విజయ దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు రాకేష్ ఇంటర్ పూర్తి చేసి స్థానికంగా హార్వెస్టర్ నడుపుతున్నాడు.

కూతురు ప్రసన్న ఇటీవలే డిగ్రీ పూర్తి చేసింది. వీళ్లిద్దరూ వరంగల్ లో ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు ఆదివారం సాయంత్రం బైక్ పై దబ్బీర్ పేట నుంచి బయల్దేరారు. నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామ శివారులో నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారిపై ఓ టిప్పర్ వేగంగా వచ్చి వారి బైక్ ను ఢీకొట్టింది. ఈఘటనలో రాకేష్, ప్రసన్నలు అక్కడికక్కడే మృతి చెందారు.

గత 5యేళ్ల క్రితం వారి తండ్రి మొగుళ్ల రమేష్, 2 ఏళ్ల క్రితం తల్లి విజయ రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. అప్పటి నుంచి నానమ్మ సాంబలక్ష్మి ఇంట్లో అన్నాచెల్లెళ్లు ఉంటున్నారు. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ ఇద్దరు సైతం రోడ్డుప్రమాదంలో మృత్యువాతపడటం అందరినీ కలిచివేసింది. అయితే ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్న నానమ్మ, గత నెలలో ఇద్దరికీ పెళ్లి సంబంధాలు చూసి నిశ్చితార్థాలు చేశారు. వచ్చే యేడాది జనవరిలో వీరికి పెళ్లి జరగాల్సింది. శుభకార్యాలు జరగాల్సిన ఇంట్లో ఈ విషాదం చోటుచేసుకోవడంతో ఈ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. ఎస్సై బొజ్జ రవీందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.