సీబీఐ ముందు వివేకా హత్య కేసు నిందితులు 

సీబీఐ ముందు వివేకా హత్య కేసు నిందితులు 

వరంగల్ టైమ్స్, కడప జిల్లా : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. నిందితులను నేడు ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచాలన్నారు. దీనికోసం కడప జైలులో ఉన్న నిందితులు ఉమా శంకర్ రెడ్డి, దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ లను ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య ఉదయం 4 గంటలకు కడప జైలు నుంచి హైదరాబాద్ కు తరలించారు. నిందితులను నాలుగు వాహనాల్లో హైదరాబాద్ కు తరలించారు.

ఇక ఉదయం 10. 30 గంటలకు ఈ ముగ్గురు నిందితులతో పాటు బెయిల్ పై ఉన్న ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి కూడా సీబీఐ కోర్టులో హాజరుకానున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వివేకా హత్య కేసు విచారణ కడప నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయింది.ఈ నేపథ్యంలో తొలిసారిగా వివేకా హత్య కేసులోని ఐదుగురు నిందితులను నేడు సీబీఐ కోర్టు ముందు హాజరుకానున్నారు.

ఈ క్రమంలో న్యాయమూర్తి ప్రత్యక్షంగా, కోర్టులో నిందితులను భౌతికంగా చూడనున్నారు. తర్వాత న్యాయమూర్తి ఉత్తర్వుల మేరకు ముగ్గురు నిందితులైన సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమా శంకర్ రెడ్డిలను తిరిగి కడప జైలుకు తీసుకెళ్తారా ? లేక హైదరాబాద్ లోని మరో జైలుకు తరలిస్తారా ? అనేది న్యాయమూర్తి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.

నిందితులను హైదరాబాద్ కు తరలిస్తున్నారన్న సమాచారంతో గురువారం సాయంత్రమే దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి కుటుంబసభ్యులు ఆయనను జైలుకెళ్లి కలిసారు. శివశంకర్ అనుచరులు కూడా చాలామంది హైదరాబాద్ కు వచ్చినట్లుగా తెలుస్తోంది.