టీవీ ఛానళ్లకు కేంద్రం వార్నింగ్..!
వరంగల్ టైమ్స్, ఢిల్లీ : ప్రమాదాలు, నేరాలకు సంబంధించిన ఘటనల్లో కొన్ని మీడియా ఛానళ్లు భయంగొలిపే వీడియోలు, ఫొటోలను ప్రసారం చేస్తుండటంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ (ఐ అండ్ బీ మినిస్ట్రీ )ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఫుటేజ్‌లు బాధితుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే కాక, చిన్నారులపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని పేర్కొంది.
ఈ మేరకు మహిళలు, పిల్లలు, వృద్ధులపై జరిగే హింస, ప్రమాదాలు, మరణాలకు సంబంధించిన ఘటనల్లో ఫుటేజ్‌లను యథావిధిగా రిపోర్ట్ చేయకుండా అన్ని టీవీ చానెళ్లకు అడ్వైజరీ జారీ చేసింది. ఇటీవల ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ ఫొటోలు వైరల్ అయిన వేళ.. ఈ అడ్వైజరీ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
“కొన్ని కథనాలను ప్రసారం చేసే క్రమంలో టీవీ ఛానళ్లు మృతదేహాలను, రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రుల ఫొటోలను బాగా దగ్గర్నుంచి చూపిస్తున్నాయి. టీచర్ చిన్నారులను కొట్టే వీడియోలు, మహిళలు, పిల్లలు, పెద్దలపై జరిగిన దాడులకు సంబంధించిన ఫుటేజ్‌లను కూడా అలాగే ప్రసారం చేస్తున్నాయి. చాలా కేసుల్లో సోషల్‌మీడియా నుంచి నేరుగా వీడియోలను తీసుకుని ఎలాంటి ఎడిటింగ్, బ్లరింగ్ చేయకుండానే తమ మాధ్యమాల్లో ప్రసారం చేస్తున్నారు.
నేరాలకు ఇలా రిపోర్ట్ చేయడం హృదయ విదారకమే గాక, ప్రొగ్రామ్ కోడ్ నిబంధనలకు విరుద్ధం. ఇలాంటి ఫుటేజ్‌లు ప్రేక్షకులను కలవరపాటుకు గురిచేస్తాయి. బాధ కలిగిస్తాయి. అంతేగాక, చిన్నారులపై ఇవి మానసికంగా తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఇందులో మరో కీలకమైన అంశం ఏంటంటే.. ఈ ఫుటేజ్‌లతో బాధితుల వ్యక్తిగత గోప్యతకు తీవ్ర భంగం కలుగుతుంది” అని మంత్రిత్వశాఖ పేర్కొంది.
టీవీల్లో వచ్చే ప్రోగ్రాంలను సాధారణంగా ప్రతీ ఇంట్లో అన్ని వయసుల వారు కలిసి కూర్చుని వీక్షిస్తుంటారు. ప్రసారసంస్థలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతమైన కంటెంట్‌ను ప్రసారం చేయాలని మంత్రిత్వశాఖ సూచించింది. నేరాలు, ప్రమాదాలు, హింసకు సంబంధించిన కథనాల విషయంలో టీవీ ఛానళ్లు జాగ్రత్తగా వ్యవహరించి.. ప్రొగ్రామ్ కోడ్‌కు అనుగుణంగా ఫుటేజ్‌లను ప్రసారం చేయాలని ఆదేశించింది.
ఇటీవల క్రికెటర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాద ఘటనలో రక్తపు గాయాలతో ఉన్న పంత్ ఫొటోలను టీవీఛానళ్లు ప్రసారం చేసిన విషయం తెలిసిందే. గతేడాది పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు గురైనప్పుడు కూడా రక్తసిక్తంగా ఉన్న ఆయన ఫొటోలు కొన్ని ఛానళ్లలో ప్రసారమయ్యాయి. గతంలోనూ ఇలాంటి ఫుటేజ్‌లు మీడియా మాధ్యమాలు ప్రసారం చేసినట్లు సమాచార, ప్రసార శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఈ అడ్వైజరీ జారీ చేసింది.