అనారోగ్యంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ మృతి

అనారోగ్యంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ మృతిహైదరాబాద్ : “టాలీవుడ్ సినీ నటుడు (క్యారెక్టర్ ఆర్టిస్ట్)కొంచాడ శ్రీనివాస్‌ (47) అనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొంచాడ శ్రీనివాస్ కన్నుమూశాడు. అతడు సుమారు 40కి పైగా సినిమాలు, 10కిపైగా టీవీ సీరియళ్లలో నటించాడు. గతంలో షూటింగ్‌ సమయంలో పడిపోవడంతో శ్రీనివాస్‌కు ఛాతీపై దెబ్బ తగిలిందని, తర్వాత గుండె సమస్యలు వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

కాగా నటుడు శ్రీనివాస్‌కు అమ్మ విజయలక్ష్మి ఉన్నారు. తండ్రి ఐదేళ్ల కిందట చనిపోయారు. తమ్ముడు కూడా పదేళ్ల కిందట మరణించాడు. ఇద్దరు అక్కచెల్లెళ్లు ఉండగా వారికి పెళ్లిళ్లు అయిపోయాయి. కొంచాడ శ్రీనివాస్ పలు హిట్ సినిమాల్లో నటించాడు. ఆది, శంకర్‌దాదా ఎంబీబీఎస్, నచ్చావులే, ప్రేమకావాలి వంటి సినిమాలు ఆయనకు పాపులారిటీని తెచ్చిపెట్టాయి. కొంచాడ శ్రీనివాస్‌ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.”