హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 47,704 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజే దేశవ్యాప్తంగా 654 మంది మరణించారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,83,157కు చేరుకున్నది. దీంట్లో 4,96,988 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 9,52,744 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 33,425 మంది కరోనా వైరస్‌తో మృతిచెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా రికవరీ రేటు పెరిగినట్లు కూడా కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. రికవరీ రేటు 64.23 శాతానికి పెరిగినట్లు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. వైరస్ సోకిన వారిలో 96.6 శాతం కోలుకోగా.. 3.4 శాతం మంది మరణించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా జులై 27వ తేదీ వరకు 1,73,34,885 మందికి కోవిడ్ పరీక్షలు చేపట్టినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. నిన్న ఒక్క రోజే 5,28,082 మందికి కోవిడ్ పరీక్షలు చేపట్టినట్లు ఐసీఎంఆర్ పేర్కొన్నది.