దంపతులను ఢీకొట్టిన కారు.. వంతెన పైనుంచి పడి మృతి

దంపతులను ఢీకొట్టిన కారు.. వంతెన పైనుంచి పడి మృతిబెంగళూరు : బైక్‌పై వెళ్తున్న దంపతులను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో వారు వంతెన పైనుంచి ఎగిరి కింద పడి మరణించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. తమిళనాడుకు చెందిన ఒక జంట బైక్‌వై వెళ్తూ ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్‌ మధ్యలో ఒక పక్కగా ఆగారు. ఇంతలో వేగంగా వచ్చిన కారు వారిద్దరిని ఢీకొట్టింది. దీంతో ఆ దంపతులు 30 అడుగుల ఎత్తులో ఉన్న వంతెన పైనుంచి ఎగిరి కింద పడ్డారు.

వారిద్దరు అక్కడికక్కడే చనిపోయారు.ఆ కారును ఒక యువకుడు నడిపినట్లు సమాచారం. మరో కారును ఓవర్‌టేక్‌ చేయబోయి అదుపుతప్పి బైక్‌పై ఉన్న దంపతులను వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకుంటున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.