ఏళ్ల నాటి కల బోర్నపల్లి బ్రిడ్జి

ఏళ్ల నాటి కల బోర్నపల్లి బ్రిడ్జి

జగిత్యాల జిల్లా : జగిత్యాల ప్రజల ఏళ్ల నాటి కల బోర్నపల్లి వంతెన అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. 2014 ఎన్నికల సమయంలో వంతెన, రెండు లేన్ల రహదారి నిర్మిస్తానని హామీ ఇచ్చానని నేడు అదే వంతెనను ప్రజలతో కలిసి పరిశీలించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజల కల సాకారమైందన్నారు. బ్రిడ్జి, రోడ్డు లేక ఏళ్లుగా తాము పడ్డ బాధలను ఈ సందర్భంగా ప్రజలు ఎమ్మెల్సీ కవితతో పంచుకున్నారు. ఇచ్చిన మాటను నిలుపుకొని ఇక్కడి ప్రజలకు రోడ్డు, వంతెన సౌకర్యాన్ని కల్పించిన కవిత కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. కవిత వెంట జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్​, నాయకులు ఉన్నారు.

బోర్నపల్లి బ్రిడ్జి నేపథ్యం

జగిత్యాల నియోజకవర్గం రాయికల్‌ మండలం బోర్నపల్లి, నిర్మల్‌ జిల్లా చిన్నబెల్లాల, పెద్ద బెల్లాల గ్రామాల మధ్య గోదావరి ప్రవహిస్తుంది. నదిపై వంతెన నిర్మించాలని మండల ప్రజలు చాలా ఏండ్లుగా డిమాండ్‌ చేస్తున్నారు. కానీ, అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ క్రమంలో 2014లో ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుంట్ల కవిత రాయికల్‌ మండలంలోని అటవీ గ్రామాలకు వచ్చారు. గోదావరిపై వంతెన నిర్మించాలని పలు గ్రామాల ప్రజలు వేడుకున్నారు. సమస్యను గుర్తించిన ఆమె, వంతెన నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వంతెనతోపాటు బోర్నపల్లి నుంచి రాయికల్‌ దాకా 18కిలోమీటర్ల మేర రెండు వరుసల రహదారి నిర్మాణానికి 70 కోట్ల రాష్ట్ర సర్కారు నిధులు మంజూరు చేయించారు. పనులు మొదలై, కొద్దిరోజుల క్రితమే వంతెన పూర్తయింది. వంతెన రాకతో సమీప గ్రామాల ప్రజల వెతలు తీరడంతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల మధ్య దూర భారం తగ్గింది. రవాణా సౌకర్యం మెరుగుపడింది.