త్వరలో డిజిటల్‌ ఓటరు కార్డులు!.

త్వరలో డిజిటల్‌ ఓటరు కార్డులు!.ఢిల్లీ: డిజిటల్‌ ఓటరు గుర్తింపు కార్డులను జారీచేసే విషయమై ఎన్నికల కమిషన్‌ యోచిస్తోంది. అయితే ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. ‘‘డిజిటల్‌ ఓటరు కార్డులను జారీ చేయాలంటూ ప్రజలతో పాటు క్షేత్ర, రాష్ట్రస్థాయి ఎన్నికల అధికారుల నుంచి సలహాలు వస్తున్నాయి. మొబైల్‌ ఫోన్, వెబ్‌సైట్, ఈ-మెయిల్‌ ద్వారా డిజిటల్‌ ఐడీలను త్వరగా పొందేందుకూ, వినియోగించేందుకూ ఆస్కారముంటుంది. సాధారణ కార్డులను ముద్రించి, ప్రజలకు అందించడం వ్యయ, ప్రయాసలతో కూడుకున్న ప్రక్రియ’’ అని సదరు అధికారి వ్యాఖ్యానించారు. డిజిటల్‌ కార్డులకు సాంకేతిక భద్రత ఉంటుందా? దుర్వినియోగమయ్యే ప్రమాదముందా? అన్న విషయాలను పరిగణనలోకి తీసుకుంటామని మరో అధికారి తెలిపారు. ఆధార్, పాన్, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి గుర్తింపు కార్డులు ఇప్పటికే డిజిటల్‌ విధానంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఓటరు కార్డులను కూడా డిజిటల్‌ విధానంలో అందించాలని ఎన్నికల కమిషన్‌కు వినతులు వస్తున్నాయి.