హైదరాబాద్ : ప్రస్తుత విద్యాసంవత్సరానికి స్కాలర్ షిప్ దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. రాష్ట్రంలోని అన్ని కళాశాలల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ , ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులు వచ్చే సంవత్సరం జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. ఈ మేరకు షెడ్యూల్డ్ కులాల కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులిచ్చారు. కాలేజీల మేనేజ్మెంట్లు లేదా విద్యార్థులు వ్యక్తిగతంగా ఈ-పాస్ పోర్టల్ లో దరఖాస్తులు అప్ లోడ్ చేయాలని సూచించారు.
ఈ-పాస్ వెబ్ సైట్ ద్వారా స్కాలర్ షిప్స్ రెన్యూవల్ కు 7,97,656 విద్యార్థుల్లో ఇప్పటివరకు 31,369 మందే దరఖాస్తు చేసుకున్నారని, 5,50,000 మంది కొత్త విద్యార్థులకు 1,959 మందే దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును ఈ నెల 24 నుంచి జనవరి 31 కి పొడిగించినట్లు వెల్లడించారు.