చలి పంజాలో పంథా వీడని రైతులు

చలి పంజాలో పంథా వీడని రైతులున్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళనలు 20వ రోజుకు చేరాయి. చలి పంజా విసురుతున్నా.. వందలాది మంది పోలీసుల పహారా మధ్య పోరాటం చేస్తూ అన్నదాతలు తమ పంథా మాత్రం వీడటం లేదు . దేశ రాజధాని సరిహద్దుల్లో 32 రైతు సంఘాలు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. ఢిల్లీ- జైపూర్ జాతీయ రహదారిపై రైతులు బైఠాయించగా, సింఘు ప్రాంతంలోనూ రైతుల ఆందోళన కొనసాగుతోంది.ద ఢిల్లీ-యూపీ సరిహద్దులోని ఘాజీపుర్‌లోనూ రైతు ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతుల డిమాండ్లను కేంద్రం ససేమిరా అంటున్నా…రైతులు మాత్రం మొండిగా తమ వాదాన్ని వినిపిస్తూ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గర్జించుకుని కూర్చున్నారు. తమ వాదాన్ని వివిధ రూపాల్లో కేంద్రానికి వినిపిస్తున్నారు. సాగు చట్టాలు రద్దు చేయాలన్న నినాదాలతో ఢిల్లీ పరిసర ప్రాంతాలు మార్మోగుతున్నాయి. 6 సార్లు కేంద్ర ప్రభుత్వంతో మంతనాలు జరిగినప్పటికీ రైతులకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం లేకపోవడంతో డిసెంబర్ 14న దేశ వ్యాప్తంగా రైతులు ఒక్కరోజు నిరాహార దీక్ష సైతం చేశారు. ఈ దీక్షతో స్పందించని కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. వివిధ మార్గాల్లో నిరసనలను ముమ్మరం చేయాలని భావిస్తున్న రైతులు, తదుపరి కార్యాచరణను రూపొందించనున్నారు.