ఖిలా పనులను త్వరగా పూర్తి చేయండి: కలెక్టర్

వరంగల్ అర్బన్ జిల్లా: ఖిలా వరంగల్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుటలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి , సుందరీకరణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మునిసిపల్ కమిషనర్ ఖిలా పనులను త్వరగా పూర్తి చేయండి: కలెక్టర్పమేలా సత్పతితో కలిసి ఖిలా వరంగల్ లోని తూర్పు, పడమర, పశ్చిమ, ఉత్తర కోటలలో క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గుండు చెరువు సుందరీకరణ పనులను పరిశీలించారు. చెరువు చుట్టూ రూ. 1.79 కోట్లతో చేపడుతున్న ప్రహరీ గోడ , చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, పర్యాటకుల కొరకు కాటేజీలను ఏర్పాటు చేయాలని, యాదాద్రి మాదిరిగా చిన్న స్థలంలో దట్టమైన చెట్లను పెంచాలని పిలుపునిచ్చారు. ఇందుకు గానూ లక్షా యాభైవేల మొక్కలు నాటే స్థలాన్ని పరిశీలించి వెంటనే నాటుటకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఖుష్ మహల్ ఎదురుగా శిథిలావస్థలో ఉన్న శృంగారపు బావి పరిశీలించి పునరుద్ధరణతో పాటు బావి ముందు గల ప్రైవేట్ స్థలాన్ని భూసేకరణ చేయాలని ఆదేశించారు. పర్యాటక శాఖ ద్వారా నిర్వహిస్తున్న పురావస్తు మ్యూజియం పనులు నత్తనడకన జరుగుతుండటం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మ్యూజియం పనులను కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (KUDA) స్వాధీనం చేసుకొని సత్వరమే పనులు పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. పడమర నుండి ఉత్తర కోట వరకు కందకాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని కుడా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కుడా ప్రాజెక్టు అధికారి అజిత్ రెడ్డి, ఈ.ఈ. భీమ్ రావు , తదితరులు పాల్గొన్నారు.