నేటి నుంచే తుంగభద్ర పుష్కరాలు

తుంగభద్రకు పన్నెండేళ్ల పండగ
నేటి నుంచే పుష్కరాలు
నది వద్ద నీళ్లు చల్లుకోవడానికే అనుమతి
పూజాది క్రతువులకు ఈ-స్లాట్‌ బుకింగ్‌
ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు అవకాశం
కర్నూలులో వేడుకను ప్రారంభించనున్న సీఎం జగన్‌నేటి నుంచే తుంగభద్ర పుష్కరాలుకర్నూలు : జల చైతన్య ఝరి తుంగభద్రమ్మకు పుష్కర పండగ వచ్చింది. పశ్చిమ సానువుల్లో జగద్గురువు ఆదిశంకరులు నడిచిన పుణ్యక్షేత్రం శృంగేరి వద్ద పుట్టి అమృతధారలను పంచుతూ ఇంటింటి ఇలవేల్పుగా ఆమె కీర్తి అజరామరం. హరిహర అభేదాన్ని స్మరిస్తూనే హంపీ శిలల ముంగిట చల్లగా కదలాడుతూ మంత్రాలయ క్షేత్రాన పర్యాటకులను, భక్త కోటిని పరవశింపజేస్తోంది. శక్తిపీఠం అలంపురం జోగులాంబ పాదపద్మాలను తాకుతూ సప్తనదీ సంగమ క్షేత్రం వద్ద కృష్ణమ్మలో కలిసేంత వరకు ఆమె ఒక జల దీపిక. ఈ నదీమ తల్లికి 12 ఏళ్లకోసారి వచ్చే వేడుక శుక్రవారం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1.21 గంటలకు బృహస్పతి మకర రాశిలోకి ప్రవేశించినంతనే పుష్కరాలు మొదలవుతాయి. కర్నూలులో ఏర్పాటుచేసిన సంకల్‌భాగ్‌ ఘాట్‌లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వేడుకలను ప్రారంభించనున్నారు. ఇందుకోసం నగరంలో ఇప్పటికే రూ.30 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేశారు. పుష్కరాల్లో పుణ్య స్నానాలకు అనుమతి లేదు. కేవలం చేతితో నీటిని చల్లుకోవడానికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. ఉదయం ఆరింటినుంచి సాయంత్రం ఆరింటి వరకు మాత్రమే ఘాట్లలోకి భక్తులను అనుమతిస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. పుష్కరాల సందర్భంగా నదీ ఘాట్ల వద్ద పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటుచేస్తున్నారు. ప్రతి రోజూ సంప్రదాయ నృత్య ప్రదర్శనలను నిర్వహిస్తారు. సంకల్‌భాగ్‌ ఘాట్‌ వద్ద రోజూ సాయంత్రం 6.30కు గంగాహారతినిస్తారు. కొవిడ్‌ దృష్ట్యా పుణ్యస్నానాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనందున దీని ప్రభావం భక్తుల రద్దీపై పడనుంది. కర్నూలు జిల్లాలో 25 ఘాట్లున్నాయి. జల్లుస్నానాల కోసం 20 ఘాట్లలో 10-15 చొప్పున స్ప్రింక్లర్లు ఏర్పాటుచేస్తున్నారు. జల్లు స్నానాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు.