అమరవతి: రేషన్ డీలర్లను తొలగిస్తున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు సర్కులేట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తలన్నీ అవాస్తమని, అలాంటి ఉద్దేశం జగన్ సర్కారుకు లేనది పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లడిన మంత్రి పలు అంశాలు వెల్లడించారు. గత ప్రభుత్వాల కంటే మెరుగైన నాణ్యత ఉన్న బియ్యం ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని, పేద ప్రజలు తినే రేషన్ బియ్యంలో సమూల మార్పులు తెచ్చామని మంత్రి వెల్లడించారు. ఈ నిర్ణయతో గవర్నమెంట్ పై రూ. 350 కోట్ల భారం పడ్డా పేదలకు అందించే బియ్యం విషయంలో రాజీ పడలేదన్నారు. అలాగే కోవిడ్ వ్యాప్తి సమయంలో ప్రజలపై భారం పడకుండా రేషన్ డీలర్లకు రూ.22 కోట్లు కమీషన్ రూపంలో ప్రభుత్వమే ఇచ్చిందని స్పష్టం చేశారు. రేషన్ డీలర్లను తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, వారికి ఇవ్వాల్సిన బకాయిలు కూడా త్వరలోనే చెల్లిస్తామని నాని తెలిపారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత రేషన్ డీలర్లను తొలగిస్తారనే వార్తలు సర్కులేట్ అయ్యాయి. సరుకులను గ్రామ, వార్డు వాలంటీర్లే ప్రతి ఇంటికి వెళ్లి డోర్ డెలివరీ చేస్తారని సీఎం జగన్ ప్రకటించడంతో రేషన్ డీలర్ల వ్యవస్థ రద్దు అవుతుందని ప్రచారం జరిగింది. ఈ తరుణంలో రేషన్ డీలర్లను తొలగించడం లేదని మంత్రి చెప్పడంతో.. వారికి ఊరట లభించింది.