హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పేరు ఖరారు

హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పేరు ఖరారుకరీంనగర్ జిల్లా : హుజురాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థిపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. హుజురాబాద్ ఉపఎన్నికల్లో అభ్యర్థిగా ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరు వెంకట్ ను కాంగ్రెస్ బరిలో దింపింది. పలువురు పేర్లను పరిశీలించిన కాంగ్రెస్ అధిష్టానం బలమూరు వెంకట్ పేరును ఫైనల్ చేసింది.

అటు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ , బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ లు ప్రచారంలోనూ దూసుకుపోతున్న తరుణంలో అభ్యర్థి ప్రకటనతో కాంగ్రెస్ కూడా సత్తా చాటేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటి వరకు కొండా సురేఖ హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీ చేస్తారని ఆ పార్టీ శ్రేణులు బావించాయి. అయితే అకస్మాత్తుగా బలమూరు వెంకట్ పేరు తెరపైకి వచ్చింది. దీంతో హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది తెలిసింది.

టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ విద్యార్థి నాయకుడిని అభ్యర్థిగా నిలబెడుతున్న నేపథ్యంలో బల్మూరు వెంకట్ పేరును కాంగ్రెస్ ముఖ్యులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. నామినేషన్లకు మరో 5 రోజులే గడువు ఉండటంతో ఇంకా ఆలస్యం చేయకుండా కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించింది. అభ్యర్థి ఎంపికపై శుక్రవారం జరిగిన చర్చల్లో పలువురి పేర్లు పరిశీలనకు వచ్చాయి.

వెంకట్ పేరును ప్రతిపాదించే ముందు పార్టీ ముఖ్య నేతలు , ఆయన్ని పిలిచి అభిప్రాయం తీసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ , టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ , సీఎల్పీ నేత భట్టి, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ తదితరులతో చర్చించిన అనంతరం వెంకట్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం.