హామీలు మరిచిన కేసీఆర్ : ఈటల రాజేందర్
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : హామీలు అమలు చేస్తాని రెండోసారి అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ వాటిని విస్మరించారని వరంగల్ తూర్పు ఇన్ఛార్జ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. వరంగల్ పోచమ్మమైదాన్ లోని కేఆర్ గార్డెన్స్ లో లో శనివారం జరిగిన బూత్ కమిటీ అధ్యక్షుల సమావేశంలో ముఖ్య అతిథిగా ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో జరిగిన వర్చువల్ సమావేశాన్ని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావుతో కలిసి ఈటల రాజేందర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా వర్చువల్ పద్దతిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
అనంతరం ఈ సమావేశాన్ని కేసీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఈటల మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో పాలన గాడితప్పిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను సీఎం కేసీఆర్ మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. డబుల్ బెడ్ రూంల పంపిణీ, మూడెకరాల భూమి, ఏకకాలంలో రుణమాఫీలు అమలు చేయలేదని విమర్శించారు. రైతుబంధు పేరుతో వడ్డీలేని రుణాలు, యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్ ల సబ్సిడీలను బంద్ చేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో నియోజకవర్గ కన్వీనర్ పొట్టి శ్రీనివాస్, కన్నబోయిన రాజయ్య యాదవ్, అచ్చ విద్యాసాగర్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్, అల్లం నాగరాజు, రత్నం సతీష్, వెంకటేశ్ , బూత్ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.