ఈ నెల నుంచి 21న భూముల రీసర్వే

ప్రారంభించనున్న సీఎం వైఎస్​ జగన్​
3 విడతల్లో 17,460 గ్రామాల్లో సర్వే
వందేళ్ల తరవాత దేశంలోనే తొలిసారి
ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్

ఈ నెల నుంచి 21న భూముల రీసర్వే

అమ‌రావ‌తి: దేశ చరిత్రలో తొలిసారిగా వైఎస్సార్ జగనన్న భూ హక్కు, భూ రక్ష పథకం కింద భూముల రీ సర్వే చేస్తున్నామని, మూడు దశల్లో 17,460 గ్రామాల్లో ఈ సర్వే చేపడుతున్నామని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న ఈ సర్వే ఆగస్టు 2023 నాటికి పూర్తికానుందన్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండల తక్కెళ్ల పాడు గ్రామంలో వైఎస్సార్ జగనన్న భూ హక్కు, భూ రక్ష పథకం కింద భూ రీ సర్వే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్​ ప్రారంభించనున్నారన్నారు. రీ సర్వే వల్ల గ్రామాల్లో భూ తగదాలకు ఫుల్ స్టాప్ పడతాయన్నారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్సార్ జగనన్న భూ హక్కు, భూ రక్ష పథకం కింద చేపడుతున్న భూ సర్వే దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయమన్నారు. సమర్థవంతమైన అధికారుల పర్యవేక్షణలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నామన్నారు. సర్వే ఆఫ్ ఇండియా, రాష్ట్ర రెవెన్యూ శాఖ సంయుక్తంగా రీ సర్వే చేపడుతున్నాయన్నారు.

ఈ నెల 21న సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం…
2019 ఎన్నికల ముందు నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్ర సందర్భంగా అధిక శాతం రైతుల నుంచి భూ సరిహద్దులకు సంబంధించిన ఫిర్యాదులు సీఎం జగన్​కు అందేవని డిప్యూటీ ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఆనాడే భూముల రీ సర్వే చేపట్టాలని సీఎం నిర్ణయించారని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో భూ రీ సర్వే విజయవంతమైందన్నారు. ఈ నెల 21 న సీఎం వైఎస్ జగన్​ చేతుల మీదుగా అదే గ్రామంలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భంగా భూయజమానులకు భూ హక్కు పత్రాలు సీఎం అందజేస్తారన్నారు. భూ రీ సర్వే ద్వారా గ్రామాల్లో భూ తగదాలకు, వివాదాలకు పరిష్కారం లభిస్తుందన్నారు.

3 విడతల్లో భూ రీ సర్వే…
రాష్ట్ర వ్యాప్తంగా 17,460 గ్రామాల్లో లక్షా 26 లక్షల చదరపు కిలో మీటర్లలో భూ రీ సర్వే చేపడుతున్నామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు. మూడు విడతల్లో ఈ సర్వే పూర్తి చేస్తామన్నారు. మొదటి విడత 5,000 గ్రామాల్లో, రెండో విడత 6,500 గ్రామాల్లో, మూడో విడత 5,500 గ్రామాల్లో రీ సర్వే నిర్వహిస్తామన్నారు. గ్రామాల్లో 2 కోట్ల 26 లక్షల ఎకరాల వ్యవసాయ భూముల్లో రీ సర్వే నిర్వహించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ – 2020 కింద శాశ్వత భూ హక్కు కల్పించనున్నామన్నారు. భూ హద్దులు నిర్ణయించి…సర్వే రాళ్లను పెట్టిన తరవాత భూ యజమానికి ల్యాండ్ టైటిలింగ్ చట్డం కింద భూ పటం(ల్యాండ్ మ్యాప్), భూ హక్కు పత్రం(ల్యాండ్ టైటిల్ కార్డ్) అందజేస్తామని, దీనివల్ల సదరు భూ యజమానికి ఆ భూమిపై శాశ్వత హక్కు లభిస్తుందని ధర్మాన అన్నారు.