ఊరి కొంపముంచిన మామిడికాయ పచ్చడి..!

పుణ్యం చేయబోతే కరోనా ఎదురయ్యింది

భయాందోళనలో గ్రామస్తులు

ఊరి కొంపముంచిన మామిడికాయ పచ్చడి..!

మహబూబ్‌‌‌‌నగర్ జిల్లా: వేసవికాలం వచ్చిందంటే అవకాయ పచ్చడి పెట్టుకోని తెలుగువారు ఉండరు. ఆ పచ్చడే ఓ ఊరు మొత్తాన్ని ఇరకాటంలో పెట్టింది. ఆ ఊరి ప్రజాప్రతినిధి భర్త లాక్​డౌన్ టైమ్‌‌‌‌లో ఊరంతటికీ సాయం చేద్దామనుకుని మామిడికాయ తొక్కు పెట్టించి ఊరంతా పంచాలనుకున్నాడు. అయితే పచ్చడి తయారి చేసిన వ్యక్తులకు కరోనా పాజిటివ్ కావడంతో ఆ గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. మాకు కరోనా పరీక్షలు చేయండి బాబూ అంటూ మొర పెట్టుకుంటున్నారు. మహబూబ్‌‌‌‌నగర్ జిల్లా నవాబుపేట మండలం కొల్లూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్త లాక్​డౌన్ సమయం‌‌లో ఊరంతటికీ ఏదైనా సాయం చేద్దామనుకున్నాడు. కొంత డబ్బు విరాళంగా రావడంతో మామిడి తొక్కు పెట్టి ఊరంతా పంచాలనుకున్నాడు. షాద్‌‌‌‌నగర్‌కి చెందిన తన బంధువైన వ్యాపారిని మే18న ఆశ్రయించాడు. ఊరందరికీ పచ్చడి సఫ్లై చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఇదే విషయాన్ని గ్రామసభ పెట్టి ప్రజాప్రతినిధుల సమక్షంలో గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు ప్రజాప్రతినిధి భర్త.

మే 20న షాద్‌‌‌‌నగర్ నుంచి మామిడి తొక్కు పెట్టేందుకు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు.. రోజంతా ఉండి 12 మంది సమక్షంలో 2 క్వింటాళ్ల తొక్కు పెట్టారు. అంతా దాన్ని రుచి చూశారు. వారితోనే ఉప్మా వండించుకొని తిన్నారు. వాళ్లు వెళ్లిన తర్వాత తొక్కును ప్యాక్​చేసి ఊరంతా పంచాలనుకున్నారు. కానీ అదే రోజు షాద్‌‌‌‌నగర్‌‌‌‌ వ్యాపారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తొక్కు పెట్టిన ఇద్దరికీ మరుసటి రోజు పాజిటివ్ తేలింది. విషయం తెలిసిన ప్రజాప్రతినిధి భర్తతో పాటు ఊర్లోని అందరికీ భయం మొదలైంది. తొక్కు పెట్టిన వాళ్లకు కరోనా రావడంతో గ్రామస్తులు ఆ తొక్కును డంప్‌‌‌‌ యార్డులో పడేశారు. దీంతో ఊరు ఊరంతా వణికిపోతోంది. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. “భయపడి చస్తున్నం.. టెస్టులు చేయండంటూ” మొత్తుకుంటున్నారు. అధికారులు పట్టించుకోక పోవడంతో ఆ ఇద్దరితో ఎక్కువగా కాంటాక్టయిన 12 మందికైనా పరీక్షలు చేయండంటూ ఊరోళ్లు మొర పెట్టు కుంటున్నారు. 4 వేలకు పైగా జనం ఉన్న ఆ ఊర్లో ఇప్పుడు 100 మందికి పైగా హోమ్‌‌‌‌ క్వారంటైన్‌‌‌‌లో ఉన్నారు. ఎవరికి వైరస్ సోకిందో తెలియక అంతా మానసికంగా భయపడి పోతున్నామని, ఇప్పటికైనా టెస్టులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.