రికార్డు స్థాయిలో శ్రీవారి ఆదాయం 

రికార్డు స్థాయిలో శ్రీవారి ఆదాయం

వరంగల్ టైమ్స్, తిరుమల : తిరుమల శ్రీవారి ఆదాయం రికార్డు స్థాయిలో సమకూరింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని నిన్న ఒకే రోజు రూ.768 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెల్పింది. ఒకే రోజు ఇంత పెద్ద మొత్తంలో హుండీ ద్వారా కానుకలు రావడం ఇదే మొదటిసారి. గత సంవత్సరం అక్టోబర్ 23న లభించిన రూ.6.31 కోట్ల హుండీ ఆదాయమే ఇప్పటి వరకు అత్యధికం కాగా, ఆ రికార్డు ఇప్పుడు బ్రేక్ అయ్యింది.రికార్డు స్థాయిలో శ్రీవారి ఆదాయం వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనానికి ప్రముఖులు పోటెత్తడంతో ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి వైకుంఠ ద్వారం దర్శనానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. నిన్న ఒకే రోజు 69,414 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 18,612 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఈ నెల 11వ తేదీ వరకు వైకుంఠ ద్వారం దర్శనం కొనసాగుతుండటంతో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది.