అసెంబ్లీలో ‌టీడీపీ సభ్యుల గందరగోళం

అమ‌రావ‌తి : శాస‌న‌స‌భ శీతాకాల స‌మావేశాల్లో భాగంగా ఐదో రోజున శుక్ర‌వారం ఉద‌యం సభ ప్రారంభమైనప్పటి నుంచే ప్రతిపక్ష సభ్యులు గందరగోళం సృష్టించారు. గట్టిగా నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించారు. ముఖ్యమైన బిల్లులు ఉన్నాయని సహకరించాలని స్పీకర్ కోరినా టీడీపీ సభ్యులు వినలేదు. విపక్ష సభ్యుల గందరగోళం నడుమ పలు కీలక బిల్లులను సభ ఆమోదించింది. ప్రతిపక్ష సభ్యుల తీరును అధికార పక్షం తప్పుబట్టింది. టీడీపీ ఎమ్మెల్యేల నినాదాల నేపథ్యంలో 15 నిమిషాల పాటు సభను స్పీకర్‌ వాయిదా వేశారు. విలువైన సమయాన్ని ప్రతి రోజు వృథా చేస్తున్నారని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. స్పీకర్‌ స్థానాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు చెప్పిన ప్రతి అంశాన్ని చర్చిస్తున్నా ఈ విధంగా సభా కార్యకలాపాలను అడ్డుకోవడం తగదన్నారు. కేవలం బురద చల్లాలనే ప్రయత్నంతోనే ఏదోరకంగా సభను ఆటంకపరచాలని టీడీపీ సభ్యులు చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ఆయ‌న ప్రశ్నించారు.