సాగర్ ఉపఎన్నిక బరిలో నిలిచేదెవరు..గెలిచేదెవరు?

సాగర్ ఉపఎన్నిక బరిలో నిలిచేదెవరు..గెలిచేదెవరు?నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం రాజుకుంది. మొన్నటికి మొన్న దుబ్బాక, నేటి జీహెచ్ఎంసీ ఎన్నికలలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగలడంతో ప్రజల్లో సార్వత్రిక ఎన్నికల స్థాయిలో చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ ఎన్నిక సైతం ప్రాధాన్యత సంతరించుకొంటుంది. ఇప్పటికే అన్ని పార్టీల అధినాయకత్వాలు దీనిపై దృష్టిసారించినట్టుగా కన్పిస్తోంది. గత మూడు దశాబ్ధాలుగా నాగార్జున సాగర్లో పాతుకుపోయిన జానారెడ్డి కుటుంబం గురించి సైతం ప్రజల్లో తీవ్రంగా చర్చలు నడుస్తున్నాయి. దాదాపు డెబ్బైఐదేళ్ల వయోభారంతో ఉన్న జానారెడ్డి తన కొడుకుని రాజకీయ వారసుడిగా తీసుకరావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న బీజేపీ వైపు జానారెడ్డి కుమారుడు చూస్తున్నట్టుగా కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే బీజేపీ జాతీయ నేత డీకే అరుణతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఐతే జానారెడ్డి హోంమంత్రిగా, పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్న సమయంలో తండ్రి పవర్ ను వాడుకుని ఆయన కొడుకు అనేక దందాలు నడిపాడనే అభియోగాలు ఉన్నాయి. అతని ఒంటెత్తు పోకడలకు తోడు అనేక సెటిల్మెంట్ వ్యవహారాల ద్వారా సాగర్లో అతనిపై స్థానిక నేతలతో పాటు ప్రజల్లో సైతం తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టుగా స్థానికులు బాహాటంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అతన్ని చేర్చుకోవడంపై మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తుంది. దీనికి తోడు గత ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసిన నివేదిత సైతం పార్టీ టిక్కెట్ పై భరోసాతో ఉన్నారు, నాగార్జునసాగర్ బీజేపీ క్యాడర్ కి నిరంతరం అందుబాటులో ఉండడంతోపాటు వారికి సరైన మార్గనిర్దేశనం ద్వారా నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేశారనే పేరుంది. పార్టీ క్యాడర్ సైతం ఆమెనే బరిలో నిలపాలని భావిస్తున్నారు. దీంతో వరుస విజయాలతో ఉన్న బీజేపీ అధినాయకత్వం సైతం అరువు నేతలతో కాకుండా అసలు నేతలతోనే బరిలో నిలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.