సీఎం జగన్​కు కృతజ్ఞతలు

సీఎం జగన్​కు కృతజ్ఞతలుఅమరావతి : కరోనా మహమ్మారి వల్ల దెబ్బతిన్న పరిశ్రమల పునఃప్రారంభంలో భాగంగా సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. కష్టాల్లో ఉన్న సినీ పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘మీరు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సినీ పరిశ్రమలోని థియేటర్లతో పాటు ఎందరో కార్మికులకు జీవనోపాధి కలగడంతో పాటు వేలాది కుటుంబాలు లబ్ధిపొందుతాయని’హర్షం వ్యక్తంచేశారు. కాగా ఏపీ ప్రభుత్వం మూడు నెలలపాటు థియేటర్లు చెల్లించాల్సిన నిర్ణీత విద్యుత్​ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం నెలకు రూ.3కోట్ల చొప్పున బకాయిల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. మిగిలిన ఆరు నెలల విద్యుత్​ బకాయిలను వాయిదా పద్థతిలో చెల్లించే అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. థియేటర్లకు రుణాలు, మారటోరియం విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం పలు వరాలు ప్రకటించింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.