జనవరి 8న ‘మెలోడియస్ మూమెంట్స్ విత్ సునిత’

స్వర్గీయ బాలు నుంచి ఎన్నో నేర్చుకున్నా: సింగర్ సునితజనవరి 8న 'మెలోడియస్ మూమెంట్స్ విత్ సునిత'హైదరాబాద్ : సుమధురా స్వర గాయనీ సునిత సంగీత ప్రియులను తన గాన మాధుర్యంతో ఓలలాడించానున్నారు. ఎలెవన్ పాయింట్ టూ, ఎన్ఎస్ఆర్ ఎస్టేట్ సంయుక్తంగా జనవరి 8న మాదాపూర్లోని శిల్పకళా వేదికలో ‘మెలోడియస్ మూమెంట్స్ విత్ సునిత – లైవ్ ఇన్ కాన్సర్ట్’ ను నిర్వహించనుంది. ఈ సందర్భంగా నగరంలో ప్రసాద్ ల్యాబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లైవ్ ఇన్ కాన్సర్ట్ సంబంధించిన గోడ పత్రికను సునిత ఆవిష్కరించారు.

సంగీతం మానసిక ఉల్లాసం అందించడంతో పాటు మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుందని సునిత అన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు స్టిఫెన్ దేవస్సీతో కలిసి సంగీత ప్రియులను అలరించనున్నట్లు చెప్పారు.

ఈ జనవరి 8న జరుగనున్న మెలోడియస్ మూమెంట్ విత్ సునీత కార్యక్రమం తన జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టి 25 యేండ్లు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు సునిత. గులాబీలోని ఈ వేళల్లో అనే పాట నుంచి నేటి వరకు పాడిన పాటలకు వినూత్నమైన రీతిలో సంగీత ప్రియులకు వినిపించనున్నట్లు ఆమె చెప్పారు.

25 సంవత్సరాల్లో తాను పాడిన ఎన్నోసూపర్ డూపర్ హిట్ పాటలు, ఈ కాన్సర్ట్ లో ఆలపించనున్నానన్నారు. తన సంగీత ప్రయాణం ఎన్నో ఒడిదుడుకులతో సాగిందన్నారు. సంగీత ప్రయాణంలో బాలు నుంచి ఎన్నో నేర్చుకున్నానని, ఆయన భౌతికంగా లేకపోయినా ఎప్పుడూ ఆయన ఆశీస్సులు ఉంటాయన్నారు.