ఏపీ వైద్య ఆరోగ్య శాఖకు జాతీయ అవార్డులు

ఏపీ వైద్య ఆరోగ్య శాఖకు జాతీయ అవార్డులు

ఏపీ వైద్య ఆరోగ్య శాఖకు జాతీయ అవార్డులు

వరంగల్ టైమ్స్, అమరావతి : రాష్ట్రీయ కిషోర స్వాస్థ్య ప్రోగ్రాంలో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్ భారత ప్రభుత్వం న్యూఢిల్లీలో నిర్వహించిన రెండవ జాతీయ స్కూల్ హెల్త్ ప్రోగ్రాం కింద అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖకు రెండు జాతీయ అవార్డులు లభించాయి. రక్తహీనత నివారణకు సంబంధించిన డబ్ల్యుఐఎఫ్ఎస్ ప్రోగ్రాం, మరియు స్కూల్ హెల్త్ ప్రోగ్రాంలు సమర్ధవంతంగా నిర్వహించినందుకు ఈ అవార్డులు దక్కాయి. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులను ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ తరపున డాక్టర్ నిర్మలా గ్లోరీ, (రాష్ట్రీయ కిషోర స్వాస్థ్య కార్యక్రమం రాష్ట్ర ప్రోగ్రాం ఆఫీసర్), డాక్టర్ కిరణ్ నాయక్ (స్టేట్ కన్సల్టంట్) అందుకున్నారు. రక్త హీనత నివారణకు ప్రతీ గురువారం ఒక నీలి రంగు ఐరన్ మాత్రను పాఠశాలల్లో 10 నుండి 15 యేళ్ల బాల బాలికలకు ఇస్తున్నారు. 44,12,717 మంది బాలబాలికలకు ఆశా కార్యకర్తలు, ఎఎన్ఎంల ద్వారా ఈ మాత్రలు పంపిణీ చేస్తున్నారు.

స్కూల్ హెల్త్ వెల్ నెస్ ప్రోగ్రాంను ఆరోగ్యశాఖ, విద్యా శాఖ సంయుక్తంగా 2020 నుండి నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతీ పాఠశాల (హైస్కూల్) నుండి ఇద్దరు ఉపాధ్యాయులను గుర్తించి వారికి 11 కౌమారుల అంశాలపై శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ప్రతీ వారం ఒక అంశంపై విద్యార్ధులకు అవగాహన కల్పించటంతో పాటు అపోహలను నివృత్తి చేస్తారు. మంగళగిరిలోని ఎపిఐఐసి బిల్డింగ్లో వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంటి క్రిష్ణబాబు ఈ అవార్డులను అందుకున్న అధికారులను శుక్రవారం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్, ఎన్.హెచ్ఎంసిఎఓ గణపతిరావు తదితరులు పాల్గొన్నారు.