ఫేక్ న్యాయవాదులపై కేసు నమోదు 

ఫేక్ న్యాయవాదులపై కేసు నమోదు

ఫేక్ న్యాయవాదులపై కేసు నమోదు వరంగల్ టైమ్స్, అమరావతి : నకిలీ ధ్రువపత్రాలతో న్యాయవాదులుగా పేర్లు నమోదు చేసుకున్న ఏడుగురు ఏకంగా పదకొండేళ్లకు పైగా దిగువ కోర్టులో ప్రాక్టీసు చేస్తున్న విషయం వెలుగు చూడడం కలకలం రేపుతోంది. ఏపీ హైకోర్టు బార్‌ కౌన్సిల్‌ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. కౌన్సిల్‌ కార్యదర్శి బి.పద్మలత గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నకిలీ న్యాయవాదులపై కేసులు నమోదయ్యాయి. మొత్తం 15 మంది నకిలీలను బార్‌ కౌన్సిల్‌ గుర్తించారు. వారిలో ఎనిమిది మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి న్యాయవాదిగా పేరును (ఎన్‌రోల్‌మెంట్‌ సరెండర్‌) ఉపసంహరించుకున్నారు. మిగిలిన ఏడుగురిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరుతూ బార్‌ కౌన్సిల్‌ ఈనెల 11న తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసులు నమోదు అయ్యాయి.

 

నిందితుల్లో చింతకాయల సీఎస్‌ఎన్‌ మూర్తి (తుని), డి.చాముండేశ్వరి (తెనాలి), సీడీ పురుషోత్తం (అనంతపురం), డి.రత్నకుమార్‌ (ఏపీ హైకోర్టు ప్రాక్టీసు) అనే మహిళ ఉన్నారు. ధ్రువపత్రాల పరిశీలనలో భాగంగా వీరి విద్యార్హత పత్రాలు సరైనవో కావో తేల్చేందుకు సంబంధిత కళాశాలలు, యూనివర్సిటీలకు పంపగా అవి ఫోర్జరీవని తేలిందని బార్‌ కౌన్సిల్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అలాగే నిక్కి నాగేశ్వరరావు (సత్తెనపల్లి), మాచర్ల వెంకటేశ్వరరావు (సత్తెనపల్లి), కొత్తూరి శ్రీనివాస్‌ వరప్రసాద్‌ (కాకినాడ)లను కూడా నిందితులుగా పేర్కొన్నారు.

*దర్యాప్తు ముమ్మరం..
ఈ ఉదంతంపై తుళ్లూరు పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ధ్రువపత్రాలను ఆయా యూనివర్సిటీలకు పంపి వాటిని నిర్ధారించాలని లేఖలు రాశారు. న్యాయవాదిగా పేరు నమోదు సందర్భంగా ఆంధ్రా యూనివర్సిటీ, బిహార్‌లోని బోధ్‌ గయ యూనివర్సిటీ, అస్సాంలోని డిబ్రూగఢ్‌ వర్సిటీ, యూపీలోని ఒక యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం తదితర కోర్సులు చదివినట్లు వీరు బార్‌ కౌన్సిల్‌కు ధ్రువపత్రాలను అందజేశారు. వాటిని బార్‌ కౌన్సిల్‌ ఆయా యూనివర్సిటీలకు పంపగా వారెవరూ తమ వద్ద చదవలేదని సమాధానం వచ్చింది. మరోవైపు తుళ్లూరు పోలీసులు సైతం ఆయా యూనివర్సిటీలకు సర్టిఫికెట్లను పంపి వాటిని నిర్ధారించాలని వారం క్రితమే కోరారు. తాజాగా మరోసారి గుర్తు చేశారు. వాళ్లు తమ వర్సిటీల్లో చదివారా లేదా అనే విషయాన్ని అధికారికంగా తెలియజేయాలని ఆయా యూనివర్సిటీల రిజిస్ట్రార్లకు లేఖలు రాశామని తుళ్లూరు డీఎస్పీ పోతురాజు తెలిపారు.

‘నిందితులపై మోసం, ఫోర్జరీ, కుట్ర, నకిలీ పత్రాలు సృష్టించటం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం. వారం క్రితమే ఫిర్యాదు అందింది. కొందరిని విచారించాం. బాధ్యులను త్వరలోనే అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడతాం. తీవ్రమైన సెక్షన్లు కావడంతో కచ్చితంగా జైలుకు వెళతారు’ అని డీఎస్పీ వెల్లడించారు.