వణుకు పుట్టిస్తున్న కొత్తరకం వైరస్

వణుకు పుట్టిస్తున్న కొత్తరకం వైరస్ఒక‌వైపు వ‌రుస వ్యాక్సిన్‌లు.. మ‌రోవైపు క‌రోనా వైర‌స్ శాంతిస్తోంద‌ని ప్ర‌పంచం ఊపిరి పీల్చుకుంటున్న వేళ బ్రిట‌న్‌లో వెలుగు చూసిన ఓ కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ వ‌ణుకు పుట్టిస్తోంది. దీనివ‌ల్ల బ్రిట‌న్‌లో ప‌రిస్థితి చేయి దాటి పోయిందంటూ లండ‌న్‌తోపాటు ఆగ్నేయ ఇంగ్లండ్‌లో అక్క‌డి ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించింది. క్రిస్మ‌స్ సంబ‌రాల‌ను ర‌ద్దు చేసింది. వివిధ యూర‌ప్ దేశాలు ఇప్ప‌టికే యూకే నుంచి వ‌చ్చే విమానాల‌పై నిషేధం విధించాయి. ఈ నేప‌థ్యంలో అస‌లు ఈ కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ ఏంటి? అది ఎంత ప్ర‌మాద‌క‌రం? అస‌లు ఇప్పుడు వ‌స్తున్న వ్యాక్సిన్‌లు ఈ కొత్త ర‌కాన్ని ఏ మేర‌కు అడ్డుకోగ‌ల‌వు? అన్న అంశాల‌ను ఇప్పుడు చూద్దాం.

ఏంటీ కొత్త ర‌కం క‌రోనా వైర‌స్‌?

క‌రోనా వైర‌స్ వెలుగు చూసి ఇప్ప‌టికే ఏడాది దాటి పోయింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ వైర‌స్ ఎన్నో మార్పుల‌కు గురైంది. అయితే ఇప్పుడు యూకేలో బ‌య‌ట‌ప‌డింది మాత్రం చాలా ప్ర‌మాద‌క‌రం అని సైంటిస్టులు అంటున్నారు. అంత‌కుముందు ర‌కం వైర‌స్ కంటే ఇది 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుండ‌టం గ‌మ‌నార్హం. ఈ కొత్త ర‌కం వైర‌స్‌ను VUI-202012/01గా గుర్తించారు. ఇతర వేరియంట్ల‌తో పోలిస్తే ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంద‌ని తాము భావిస్తున్న‌ట్లు యూకే ఆరోగ్య శాఖ నిపుణుల బృందం అయిన న్యూ అండ్ ఎమ‌ర్జింగ్ రెస్పిరేట‌రీ వైర‌స్ థ్రెట్స్ అడ్వైజ‌రీ గ్రూప్ వెల్ల‌డించింది. ఇదే విష‌యాన్ని తాము ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు కూడా చెప్పిన‌ట్లు బ్రిట‌న్ ప్ర‌భుత్వ చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ క్రిస్ విట్టీ తెలిపారు. అయితే ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నా, తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తున్న‌ట్లుగానీ, మ‌ర‌ణాల రేటును పెంచుతున్న‌ట్లుగానీ ఇప్ప‌టి వ‌ర‌కూ తేల‌లేదు. కొన్ని వారాల కింద‌టి వ‌ర‌కూ 10 నుంచి 15 శాతం ఈ కొత్త వేరియంట్ కేసులు ఉండ‌గా ఇప్పుడ‌వి 60 శాతానికి పెరిగిన‌ట్లు కింగ్స్ కాలేజ్ లండ‌న్ ప్రొఫెస‌ర్ స్టువ‌ర్ట్ నీల్ వెల్ల‌డించారు.

వైర‌స్ ఎందుకు రూపు మార్చుకుంటుంది?….

వైర‌స్ పున‌రుత్ప‌త్తి ఫ‌లితంగా జ‌న్యు క్ర‌మంలో క‌లిగే మార్పుల వ‌ల్ల ఈ మ్యుటేష‌న్ జ‌రుగుతుంది. వైర‌స్ హోస్ట్ సెల్ (అతిధేయి క‌ణం)తో జ‌త క‌లిసి త‌న జ‌న్యు ప‌దార్థాన్ని అందులోకి పంపిస్తుంది. హోస్ట్ సెల్ ఈ పున‌రుత్ప‌త్తి జ‌ర‌గ‌కుండా పోరాడినా.. వైర‌స్ కొత్త మార్గాల్లో మ‌నుగ‌డ సాగిస్తుంది. చాలా మ్యుటేషన్లు ప్ర‌మాద‌క‌రం కావు. క‌రోనా వైర‌స్ వ‌చ్చిన‌ప్పటి నుంచి కొన్ని వేల మ్యుటేష‌న్లు వ‌చ్చాయి. అందులో కొన్ని మాత్ర‌మే ప్ర‌మాద‌క‌రంగా క‌నిపించాయి. ఇప్పుడు యూకేలో క‌నిపించిన కొత్త వేరియంట్‌లాగే సౌతాఫ్రికాలోనూ ఈ మ‌ధ్యే 501.V2 వేరియంట్‌ను క‌నుగొన్నారు. ఇది ముఖ్యంగా యువ‌త‌పై ఎక్కువ‌గా ప్ర‌భావం చూపిన‌ట్లు గుర్తించారు. అంత‌కుముందు D614G మ్యుటేష‌న్ కూడా ప్ర‌పంచాన్ని ఆందోళ‌న‌కు గురి చేసింది. ఇది కూడా చాలా వేగంగా వైర‌స్ వ్యాప్తి చెంద‌డానికి కార‌ణ‌మైంది.

ఇప్ప‌టి వ్యాక్సిన్‌లు ప‌ని చేస్తాయా?

ఈ కొత్త వేరియంట్ వైర‌స్ బ్రిట‌న్‌ను వ‌ణికిస్తోంద‌ని తెలియ‌గానే అంద‌రిలోనూ ఒకే ఆందోళ‌న వ్య‌క్త‌మైంది. అదేంటంటే.. ప్ర‌స్తుతం వ‌స్తున్న వ్యాక్సిన్‌లు ఈ కొత్త వేరియంట్‌ను నియంత్రించ‌గ‌ల‌వా అని. కింగ్స్ కాలేజ్ ప్రొఫెస‌ర్ స్టువర్ట్ నీల్ ప్ర‌కారం.. ఈ మ్యుటేష‌న్లు వ్యాక్సిన్ సామ‌ర్థ్యంపై ప్ర‌భావం చూపేవే. సాధార‌ణంగా వ్యాక్సిన్లు వైర‌స్‌లోని స్పైక్ ప్రొటీన్ ల‌క్ష్యంగా ప‌ని చేస్తాయి. ఆ స్పైక్ ప్రొటీన్‌లోనే మ్యుటేష‌న్ అనేది వైర‌స్ సామ‌ర్థ్యాన్ని మ‌రింత పెంచుతాయ‌ని స్టువ‌ర్ట్ నీల్ తెలిపారు. అయితే ఈ స‌వాలును వ్యాక్సిన్‌లు ఎదుర్కొంటాయ‌ని ప‌లువురు నిపుణులు విశ్వాసం వ్య‌క్తం చేశారు. వివిధ మ్యుటేష‌న్ల‌పై ప‌రీక్షించిన‌ త‌ర్వాతే ఈ వ్యాక్సిన్‌ల‌ను తీసుకొస్తార‌ని వాళ్లు చెబుతున్నారు. స్పైక్ ప్రొటీన్‌లోని వివిధ ప్రాంతాల‌పై వ్యాక్సిన్ దాడి చేస్తుంద‌ని, ఒక చోట మ్యుటేష‌న్ జ‌రిగినంత మాత్రాన వ్యాక్సిన్ పని చేయ‌కుండా ఉండ‌ద‌ని వెల్లూర్ క్రిస్టియ‌న్ మెడిక‌ల్ కాలేజ్ ప్రొఫెస‌ర్ గ‌గ‌న్‌దీప్ కాంగ్ అంటున్నారు. ప్ర‌స్తుత వ్యాక్సిన్‌లు ప‌ని చేయ‌ని స్థాయికి మ్యుటేట్ కావాలంటే వైర‌స్‌కు కొన్నేళ్లు ప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.