ఎన్నారైలు కూడా భాగస్వాములు కావాలి : ఎర్రబెల్లి
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : మానవ వనరుల అభివృద్ధిలో ప్రధాన పాత్ర వహించే విద్య, వైద్య రంగాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వీటి కోసం పెద్ద ఎత్తున నిధులను కేటాయించి అభివృద్ధి చేస్తున్నదని, ఈ కృషిలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో అమెరికా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ సహకారంతో జరిగిన గ్లోబల్ కల్చర్ అండ్ బిజినెస్ కాన్సెప్ట్ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రముఖ కూచిపూడి కళాకారిణి డాక్టర్ పద్మజా రెడ్డిని మంత్రి దయాకర్ రావు సన్మానించారు.తెలంగాణలో పుట్టి అమెరికా, ఇతర దేశాలలో ఉన్నత హోదాలో ఉన్న ఇంజినీర్లు, తాము పుట్టిన నేలకు సేవ చేయాలని మంత్రి కోరారు. అందులో భాగంగా వైద్య, ఆరోగ్య రంగం అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. వరంగల్ నగరంలో రూ.1100 కోట్ల వ్యయంతో 34 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నామని, ఈ ఆస్పత్రిలో అందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు కల్పించబడతాయని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పిదప పద్మశ్రీ అవార్డు లభించిన మొదటి మహిళా డాక్టర్ పద్మజా రెడ్డి కావడం అభినందనీయమైనదని కొనియాడారు.
గత 50 యేళ్లుగా డాక్టర్ పద్మజారెడ్డి కూచిపూడి కళారంగానికి ప్రాధాన్యతనిస్తూ దాదాపు 3 వేల ప్రదర్శనలు ఇవ్వడం గొప్పవిషయమని ప్రముఖ కవి, గాయకులు, సాహిత్య అకాడమీ గ్రహీత, ఎమ్మెల్సీ, గోరటి వెంకన్న అన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా తెలంగాణ సంఘం అధ్యక్షుడు నరేందర్, ప్రధాన కార్యదర్శి ఎం.వెంకట్, గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్, ఇండియా అడ్వైజర్ బి. రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.