ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మాస్క్ ధ‌రించ‌క‌పోతే రూ. 1,000 జ‌రిమానా

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మాస్క్ ధ‌రించ‌క‌పోతే రూ. 1,000 జ‌రిమానాహైదరాబాద్ : ద‌క్షిణాఫ్రికాలో బ‌య‌ట‌ప‌డ్డ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్ప‌టికే 24 దేశాల‌కు విస్త‌రించిన నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. నిన్న యూకే నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వ‌చ్చిన ఓ 35 ఏండ్ల మ‌హిళ‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింద‌ని రాష్ట్ర ప్ర‌జారోగ్య సంచాల‌కులు శ్రీనివాస్ రావు వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, త‌ప్ప‌నిస‌రిగా మాస్కు ధ‌రించాల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మాస్కు ధ‌రించ‌క‌పోతే నేటి నుంచి పోలీసులు రూ. వెయ్యి జ‌రిమానా విధిస్తార‌ని తేల్చిచెప్పారు. మాస్కు ధ‌రించ‌డంతో పాటు ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు.

ముప్పు ఎప్పుడైనా రావొచ్చు
ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ క‌ట్ట‌డిపై సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న సుదీర్ఘంగా చ‌ర్చించామ‌ని తెలిపారు. ప్ర‌జ‌లు కొవిడ్ నిబంధ‌న‌లు త‌ప్ప‌క పాటించాలి. త‌ప్ప‌నిస‌రిగా అంద‌రూ కొవిడ్ టీకా రెండు డోసుల తీసుకోవాలి. ఒమిక్రాన్ నివార‌ణ‌కు మ‌న వంతు ప్ర‌య‌త్నం చేయాలి. జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోతే ఇప్పుడు జ‌రుగుతున్న అస‌త్య ప్ర‌చారాలే వాస్త‌వాల‌వుతాయి. ముప్పు ఎప్పుడైనా వ‌చ్చే అవ‌కాశం ఉంది అని శ్రీనివాస్ రావు హెచ్చ‌రించారు.