మట్టెవాడ: వరంగల్ నగరంలోని మండి బజార్‌లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రగాయాలపాలై యువకుడు మృతిచెందాడు. సీఐ గాండ్ల వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. కాశిబుగ్గ సాయిగణేష్ కాలనీకి చెందిన దేశమల్ల రాజ్‌కుమార్ (28) ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అయితే కాశిబుగ్గలో ఈనెల 21న జరిగిన ఓ వివాహ వేడుకలో గిమ్మాజిపేట బొడ్రాయి ప్రాంతానికి చెందిన యాట ప్రవీణ్ అలియాస్ డీజే లడ్డూకు, రాజ్‌కుమార్‌కు మధ్య గొడవ జరిగింది. ఆ గొడవకు సంబంధించి ఆదివారం ఉదయం పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. అయినా లడ్డూ కోపంతో రలిగిపోయాడు. ఈ క్రమంలో రాజ్‌కుమార్ ఆదివారం రాత్రి ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ పాన్ షాపు వద్ద ఉండగా లడ్డూ ఇద్దరు స్నేహితులతో ద్విచక్రవాహనంపై వచ్చి మాట్లాడాలని రాజ్‌కుమార్‌ను పక్కకు తీసుకెళ్లారు. అనంతరం లడ్డూ వెంటతీసుకొచ్చిన కత్తితో రాజ్‌కుమార్‌పై విచక్షణారహితంగా దాడిచేసి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో కుప్పకూలిన రాజ్‌కుమార్‌ను అతని స్నేహితులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు లడ్డూ, అతని స్నేహితులు పరారీలో ఉన్నారు.