యాదాద్రిలో పంచకుండాత్మక మహా క్రతువు ప్రారంభం 

యాదాద్రిలో పంచకుండాత్మక మహా క్రతువు ప్రారంభం

యాదాద్రిలో రెండోరోజు వైభవంగా ఆగమ కార్యక్రమాలు
అరణి మథనంతో.. అగ్ని దేవుడికి ఆహ్వానం
హోమ, జప, పారాయణాలతో వెల్లివిరిసిన ఆధ్యాత్మికత

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : యాదాద్రి మహా కుంభ సంప్రోక్షణలో అతి ముఖ్యమైన ఘట్టానికి మంగళవారం శ్రీకారం చుట్టారు. సాప్తాహ్నిక పవిత్రమైన పంచకుండాత్మక మహాక్రతువును ఆగమశాస్త్రబద్ధంగా రుత్విక్కులు ప్రారంభించారు. యాదాద్రిలో పంచకుండాత్మక మహా క్రతువు ప్రారంభం ఉదయం 9 గంటలకు శాంతిపాఠం తో ప్రారంభమైన కార్యక్రమాలు చతుర్వేద, పురాణేతిహాస అవధారయలు, చతుస్నానార్చన, ద్వారతోరణ ధ్వజకుంభారాధన, విశేష హవనాలు, మూలమంత్ర హవనము.. అగ్ని మథనం, ప్రతిష్ఠ, యజ్ఞ క్రతువు ప్రధానార్చకులు నల్లంథిఘల్‌ లక్ష్మీనరసింహాచార్యుల ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగాయి.

అరణి మథనంతో అగ్ని ప్రతిష్ఠ
రావి, శమీ కర్రలను రాపాడించి అగ్నిని ఆవాహన చేయడమే అరణి మథనం. ఈ ప్రక్రియలో అగ్నిని రగిలించారు. ఈ అరణితో యాగశాలలోని 5 హవన కుం డాల్లోకి అగ్ని దేవుణ్ణి ఆహ్వానించి ప్రతిష్ఠించి సాప్తాహ్నిక పంచ కుండాత్మక యాగం ప్రారంభించారు. మంగళ వాయిద్యాల నడుమ నృసింహ భగవానుడి స్తోత్రం, బీజాక్షర ప్రయుక్త మంత్రాలతో అగ్నిహోత్రం సాగింది.

వేదోక్తంగా యాగ నిర్వహణ 
యాగశాలలో తూర్పున చతురస్రం, దక్షిణాన ధనుస్సు, పడమరన వృత్తం, ఉత్తరాన త్రికోణం, ఈశాన్యంలో శ్రీమన్నానారాయణుడి పద్మ ఆకారాలలో ఏర్పాటుచేసిన పంచకుండాలలో యాగం జరుగుతున్నది. కుండాల మధ్యలో ప్రత్యేకవేదికపై స్వామివారి కవచమూర్తులను ప్రతిష్ఠించారు. నలువైపులా ప్రవేశ ద్వారాలను, దర్పణాలను ఏర్పాటుచేశారు. ఉగ్ర, జ్వాల, యోగానంద, గండభేరుండ లక్ష్మీనరసింహస్వామి పేరిట మండపంలో తూర్పువైపు రుగ్వేదం, దక్షిణాన యజుర్వేదం, పశ్చిమాన సామవేదం, ఉత్తరాన అధర్వణ వేద మంత్రాల ఆధారంగా యాగాన్ని కొనసాగించారు. ఈశాన్యంలో ఏర్పాటైన మహాలక్ష్మి కుండంతో పంచకుండాత్మక మహాయాగాన్ని సంపూర్ణంగా కొనసాగిస్తున్నట్టు అర్చకులు తెలిపారు. ఈ ఐదు కుండాలు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, మహాలక్ష్మీ సహిత శ్రీసుదర్శన నారసింహులకు ప్రతీకలని అభివర్ణించారు. విశ్వశాంతి, లోక కల్యాణం కోరుతూ ఈ యాగాన్ని నిర్వహిస్తున్నామని యాగశాల విశిష్టతను వివరించారు.

సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం 
సాయంకాల పూజాకార్యక్రమాల్లో భాగంగా ప్రధానాలయం, బాలాలయంలో అనేక పర్వాలను నిర్వహించారు. నిత్యారాధనల అనంతరం సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం, నిత్య విశేష హోమాలను నిర్వహించారు. బింబ పరీక్షలో భాగంగా.. ప్రధానాలయంలో ఆగమ శాస్ర్తానుసారంగా శిలామయ మూర్తుల స్వరూపాలను ఆగమశాస్త్ర మంత్రోక్తములతో సంప్రోక్షణ చేశారు. మానోన్మాన శాంతిహోమం అనంతరం నవ కలశములలో వివిధ నదీ జలాలను ఆవాహన గావించి నవకలశ స్నపనం నిర్వహించారు. చివరగా బాలాలయంలో నిత్యలఘు పూర్ణాహుతిని నిర్వహించారు. వేడుకల్లో జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి, ఆలయ ఆనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, ఆలయ ఈవో గీత పాల్గొన్నారు.

నేటి(బుధవారం) పూజలు 
ఉదయం 9 గంటల నుంచి..
యాగశాలలో శాంతిపాఠం, ద్వారతోరణం, ధ్వజకుంభారాధనలు, చతుఃస్థానార్చన,
మూల మంత్ర హవనములు,
షోడష కలశాభిషేకం, నిత్యలఘు పూర్ణాహుతి.

సాయంత్రం 6 గంటల నుంచి 
సామూహిక విష్ణుసహస్రనామ పారాయణం, యాగశాలలో ద్వార తోరణ ధ్వజకుంభ
ఆరాధన, మూల మంత్ర హవనములు,
పంచగవ్యాధివాసం, నిత్యలఘు పూర్ణాహుతి.