25న రైతులతో మోదీ ముఖాముఖి

25న రైతులతో మోదీ ముఖాముఖిఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ డిసెంబర్ 25న రైతులను ఉద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగించనున్నారు. నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర వైఖరిని రైతులకు స్పష్టం చేయనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన వెల్లడించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథక నిధులు రూ.18వేల కోట్ల రూపాయలను విడుదల చేయనున్నారు. ఈ సమావేశంలో ఆరు రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన రైతులు ప్రభుత్వ పథకాల ద్వారా వారు పొందిన లాభాల గురించి మాట్లాడతారని వెల్లడించారు. ఈ సమావేశం అనంతరం నూతన వ్యవసాయ చట్టాలపై రైతులకున్న అపోహలు తొలగిపోతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రాసిన లేఖను రైతులంతా చదవాలని ప్రధాని కోరారు. గతవారం మధ్యప్రదేశ్ లో జరిగిన సమావేశంలో రైతులతో ప్రతీ అంశాన్ని కూలంకషంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ప్రతిపక్షాలు రైతులను పెడదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు నిరాహార దీక్ష చేస్తున్నామని ప్రకటించారు.